Dubbak | ఆ అన్నాచెల్లెళ్లకు ఒకరంటే ఒకరికి ప్రాణం.. పెళ్లయిన తర్వాత కూడా ఒకే ఊరిలో ఉంటూ తమ ఆప్యాయతను కొనసాగించారు. కానీ వారి అనుబంధాల మధ్య రాజకీయాలు చిచ్చురేపాయి. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఇద్దరూ కౌన్సిలర్లుగా గెలిచి ఐదేళ్లుగా ఒకే దగ్గర ఉన్నప్పటికీ.. ఎదురుబడినప్పటికీ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. కానీ అన్నాచెల్లెళ్ల ఆప్యాయత ముందు విబేధాలు ఎక్కువ కాలం నిలబడలేదు. ఏ మున్సిపల్ పదవి కోసమైతే విడిపోయారో.. ఆ పదవీకాలం ముగిసిపోయేసరికి ఇద్దరూ కలిసిపోయారు. దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన చివరి కౌన్సిల్ మీటింగ్‌లో ఇద్దరూ తమ అపార్థాలను పక్కనబెట్టేశారు. ఒకరినొకరు హత్తుకుని బోరున విలపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
దుబ్బాకకు చెందిన మల్లారెడ్డి, గోనెపల్లి దేవలక్ష్మీ అన్నాచెల్లెళ్లు. ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. ఐదేళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్‌లో పోటీ చేశారు. దేవలక్ష్మీ మూడో వార్డులో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా.. మల్లారెడ్డి రెండో వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. ఇద్దరూ కౌన్సిలర్లుగా గెలిచారు. కానీ ఆ ఎన్నికల సమయంలో అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఒకే పట్టణంలో ఉన్నప్పటికీ మాట్లాడుకోవడం మానేశారు.
కౌన్సిలర్లుగా ఇద్దరూ కలిసి వార్డుల్లో తిరిగినా.. మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఎదురుబడినా అస్సలు పట్టించుకునేవారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించారు. అలా ఐదేళ్లు గడిచిపోయాయి. ఇవాళ దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి కౌన్సిలర్లుగా ఆ అన్నాచెల్లెళ్లు హాజరయ్యారు. ఏ పదవి కోసమైతే తమ మధ్య విభేదాలు వచ్చాయో.. ఆ పదవే ఇవాల్టితో ముగిసిపోయింది. దీంతో పదవుల కోసం పాకులాడి ఏం సాధించామని ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో దేవలక్ష్మీ తన అన్నను చూసి భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే తన సోదరుడి దగ్గరికి వెళ్లి అతన్ని కౌగిలించుకుని బోరున ఏడ్చేసింది. ఒక్కసారిగా తన సోదరి వచ్చి హత్తుకుని ఏడ్చేయడంతో అన్న కూడా కరిగిపోయాడు. మల్లారెడ్డి కోసం చెల్లెను పట్టుకుని విలపించాడు. అనంతరం తన సోదరి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ సంఘటనతో అక్కడి వాతావరణం మొత్తం భారంగా మారిపోయింది. ఆ సమావేశానికి హాజరైన అందరూ భావోద్వేగానికి గురయ్యారు.