Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : రేవంత్రెడ్డి సర్కారు అప్పులు తెచ్చుకొనేందుకు కూడా ఓ బ్రోకరేజ్ సంస్థను పెట్టుకున్నది! కొత్త అప్పులు సృష్టించి ఇప్పించేందుకు ఆ సంస్థకు ప్రభుత్వం కమీషన్ కూడా చెల్లిస్తున్నది. పెద్ద మొత్తంలో అప్పులు చేసి ప్రజలపై భారం మోపడంతోపాటు ప్రజాధనాన్ని పప్పుబెల్లంలా పంచిపెడుతున్నది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కి కేటాయించింది. ఆ భూములను టీజీఐఐసీ ద్వారా తాకట్టు పెట్టించి, 2024 డిసెంబర్లో రేవంత్ సర్కారు రూ.10,000 కోట్ల అప్పు తెచ్చింది. అప్పు సృష్టించి ఇప్పించినందుకు బ్రోకరేజ్ సంస్థగా పనిచేసిన ‘ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్స్ ప్రైవేటు లిమిటెడ్’కు రాష్ట్ర ప్రభుత్వం రూ.169,83,97,978 చెల్లించింది.
అంటే దాదాపుగా రూ.169 కోట్ల ప్రజాధనం బ్రోకరేజ్ సంస్థకు కట్టబెట్టింది. ఇందులో ఇంకో విశేషం ఏమిటంటే.. దీనితోపాటు 18% జీఎస్టీ కూడా ముట్టజెప్పింది. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యు లు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. హెచ్ఎండీఏ ద్వారా రూ.20 వేల కోట్లు, జలమండలి ద్వారా మరో రూ.10 వేల కోట్లు రుణ సేకరణ బాధ్యతను కూడా ఈ బ్రోకరేజ్ సంస్థకే అప్పగించినట్టు తెలిసింది. న్యాక్ భూములు 50 ఎకరాలు, మహేశ్వరం నియోజకవర్గంలో మరో 20 ఎకరాల భూములను విక్రయించాలని రేవంత్ సర్కారు యోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.