Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీని హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ విన్ ఓవెన్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అకడమిక్ భాగస్వామ్యం, ఉన్నత విద్యలో పరస్పర సహకారం కోసం వర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. యూకేలోని ప్రఖ్యాత విద్యాసంస్థలతో అకడమిక్, పరిశోధనా సహకారాలను అన్వేషించి ఓయూతో కలిసి పనిచేసే విషయమై వారు చర్చించారు. ఓయూ పరిపాలనా భవనంలో జరిగిన సమావేశంలో గ్లోబల్ అకడమిక్ వాతావరణాన్ని ఏర్పరచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఓయూ అధికారులు స్పష్టం చేశారు. యూకే వర్శిటీలతో భాగస్వామ్యం ద్వారా ఉత్తమ విధానాలు, సంయుక్త పరిశోధనలను ప్రోత్సహించటం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు అంతర్జాతీయ అవగాహన కల్పించేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు.
గెరెత్ ఓవెన్ మాట్లాడుతూ.. చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయం సాధిస్తున్న ప్రగతి, అభివృద్ధి లక్ష్యాలను అభినందించారు. ఉస్మానియా లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థతో కలిసి పనిచేసేందుకు యూకే లోని ప్రైవేటు, ప్రభుత్వ విద్యా రంగం ఆసక్తిగా ఉందని చెప్పారు. ముఖ్యంగా కృత్రిమ మేధ, జీవశాస్త్రం, సస్టైనబిలిటీ, విద్యార్థుల మార్పిడి వంటి రంగాల్లో మున్ముందు ఓయూతో భాగస్వామ్యం అయ్యే అవకాశాలున్నాయని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఫ్యాకల్టీ ఎక్చేంజ్, డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్, ఇన్నొవేషన్ హబ్‌లు, సంయుక్త పరిశోధన నెట్వర్క్ వంటి ప్రాథమిక అవకాశాలు చర్చకు వచ్చాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ ట్రేడ్ అడ్వైజర్ (టెక్నాలజీ, ఎడ్యుకేషన్) టు బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ పీయూష్ అవస్తీ, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేశ్ రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ ఎస్. జితేంద్ర కుమార్ నాయక్, సైన్స్ డీన్ ప్రొఫెసర్ కరుణసాగర్, ప్రొఫెసర్ కె. శ్యామల, ప్రొఫెసర్ సి. శ్రీనివాసులు, ప్రొఫెసర్ ఎల్. శివరామకృష్ణ, ప్రొఫెసర్ బి. భీమ, ఆఫీస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. విజయ, సంయుక్త డైరెక్టర్లు ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ ఎంఏ హమీద్, ఇంటర్నేషనల్ అఫైర్స్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.