శంషాబాద్ రూరల్, జూన్ 22: శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్లోని హీత్రూ ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన విమానం మూడున్నర గంటల ఆలస్యంగా బయల్దేరిన ఘటన శంషాబాద్ ఎయిర్పోర్టులో చోటుచేసుకుంది. ఎయిర్పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 8 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి 263మంది ప్రయాణికులతో బీఏ 276 విమానం ఇరాన్ మీదుగా లండన్లోని హీత్రూకు వెళ్లాల్సి ఉండగా..
ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్లోని హీత్రూ ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన విమానానికి అనుమతి లభించలేదు. ఆ తర్వాత 11.34 గంటలకు అనుమతి రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయల్దేరి వెళ్లినట్టు అధికారులు తెలిపారు.