హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనాల(బీపీవీ) ఏర్పాటు కార్యక్రమం వడివడిగా కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,725 బీపీవీలను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఒక్కొక్క బీపీవీని ఐదు నుంచి పది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఇప్పటివరకు 2,301 స్థలాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో మొత్తం 11,865 ఎకరాల స్థలాన్ని సేకరించారు. వీటిలో 1,706 స్థలాల్లో పనులు ప్రారంభించగా, 1,211 చోట్ల బీపీవీల ఏర్పాటు పూర్తయ్యింది. మరో 424 బీపీవీలకు స్థలాలను గుర్తించాల్సి ఉన్నది. గ్రామాల్లో కూడా పట్టణ ప్రాంతాల తరహాలో పార్కులు, వాకింగ్ ట్రాక్లు ఉండాలన్న లక్ష్యంతో అడవిని తలపించేలా బీపీవీలను ఏర్పాటు చేస్తున్నారు. మియావాకీ విధానంలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటుతున్నారు. మండలానికి సగటున ఐదు చొప్పున ఏర్పాటుచేయనున్నారు. వీటి కోసం దాదాపుగా రూ.300 కోట్ల వరకు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. గ్రామీణ విద్యార్థులు సెలవుల్లో సేద దీరడానికి, సాయంత్రం వేళల్లో వృద్ధులు కాలక్షేపం చేయడానికి పల్లె బృహత్ వనాలు దోహదపడతాయని భావిస్తున్నారు.