సుల్తాన్‌బజార్, జూలై 31 : కంపెనీ ఆస్తుల అసెస్మెంట్ కోసం రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ వాణిజ్య పన్నుల శాఖ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి రేంజ్ డీఎస్సీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్.. తన సాఫ్ట్వేర్ కంపెనీ ఆస్తుల అసెస్మెంట్ కోసం పంజాగుట్ట సర్కిల్-1 స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్‌రెడ్డికి దరఖాస్తు చేశారు.
సదరు దరఖాస్తు ఫార్మాట్ సరిగా లేదని ఎస్టీవో శ్రీకాంత్‌కు షోకాజ్ నోటీసులు పంపించారు. శ్రీకాంత్ డ్యాక్యుమెంట్లు సరిగానే అందజేశానని తెలుపగా.. రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని అధికారి డిమాండ్ చేశాడు. దీంతో రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న శ్రీకాంత్ ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బుధవారం అబిడ్స్‌లోని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్‌లో శ్రీకాంత్ నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఎస్టీవో శ్రీధర్‌రెడ్డిని పట్టుకున్నారు. శ్రీధర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు.