High Court | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ఫిర్యాదుదారుడి కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన న్యాయవాదికి పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలీసులు ఏ అధికారంతో ఆ పరీక్ష నిర్వహించారని నిలదీసింది. చట్టంలోని ఏ నిబంధన ప్రకారం ఆ పరీక్ష నిర్వహించారో చెప్పాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
ఫిర్యాదు గురించి తెలుసుకునేందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తన పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని న్యాయవాది సుబ్బారావు వేసిన వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ శుక్రవారం విచారణ జరిపారు. సుబ్బారావుకు పోలీసులు చట్టవిరుద్ధంగా బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారని, సివిల్ డ్రస్‌లో ఉన్న పోలీసులు ఆయనను చుట్టుముట్టి నోటికొచ్చినట్టుగా దుర్భాషలాడారని సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్ వాదించారు.
అనంతరం సుబ్బారావుకు బెదిరింపులు కూడా మొదలయ్యాయని, గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను వెంబడించారని పేర్కొంటూ.. సంబంధిత వీడియో ఉన్న పెన్‌డ్రైవ్‌ను కోర్టుకు అందజేశారు. పోలీసుల తరపు న్యాయవాది మహేశ్ రాజే ప్రతివాదన చేస్తూ.. పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. పిటిషనర్ ఫిర్యాదుపై మెజిస్ట్రేట్ అనుమతితో కేసు నమోదైందని, గాయని మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేశామని చెప్పారు.
అనంతరం పిటిషనర్ సమర్పించిన వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి.. పోలీస్ స్టేషస్‌కు వచ్చిన వారికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించడం చట్టబద్ధం కాదన్నారు. ఏ అధికారంతో బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. చట్టపరిధిని అతిక్రమించి పిటిషనర్ వ్యక్తిగత జీవితానికి, స్వేచ్ఛకు భంగం కలిగించరాదని స్పష్టం చేశారు. ఘటన రోజున రికార్డయిన వీడియో ఫుటేజీని భద్రపరచాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రతివాదులైన హోంశాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ పోలీసు కమిషనర్, డీజీపీ, పంజాగుట్ట ఎస్‌హెచ్‌వోతోపాటు వ్యక్తిగత హోదాలో సీఐ రామకృష్ణకు నోటీసులు జారీచేసి, తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేశారు.