హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రొగ్రామ్ ఇన్వేస్టిగేటర్ గ్రూప్ అధ్యయంలో సంచలన వివరాలు వెల్లడించింది. 20 ఏండ్లలో హైదరాబాద్‌లో (Hyderabad) 69% పెరిగినట్టు తెలిపింది. ప్రతీ లక్ష మంది మహిళల్లో 54 కేసులు నమోదవుతున్నట్టు తాజా నివేదికలో పేర్కొంది. అధ్యయన వివరాలను జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నెట్వర్క్ ప్రచురించింది. దేశంలో రెండు దశాబ్దాల్లో రొమ్ము క్యాన్సర్ కేసుల జాతీయ సగటు 21శాతానికి పెరగగా.. లక్ష మహిళలలో 22 నుంచి 26.6 కేసులు పెరిగాయని తెలిపింది. 2022 నాటికి దేశంలో ఏటా 1,92,020 కొత్త కేసులు నమోదైనట్టు పేర్కొంది. అమెరికాలో లక్ష మందిలో 130-134 క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా.. ప్రారంభదశలోనే గుర్తిస్తున్నట్టు వెల్లడించింది.
భారత్‌లో 45 ఏండ్లు పైబడిన మహిళల్లో కేవలం 1.3% మంది మాత్రమే మామోగ్రాఫిక్ స్క్రీనింగ్ చేయించుకుంటుండగా.. హైదరాబాద్‌లో కేవలం 2.05% మంది మాత్రమే స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు. యూఎస్‌లో 70-84% స్కీనింగ్ చేయించుకుంటున్నారని అధ్యయనం వెల్లడించింది. రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌లో దేశంలో కేరళ 4.5శాతంతో టాప్‌లో ఉండగా.. 2.9శాతంతో కర్ణాటక తర్వాతి స్థానంలో నిలిచింది. మన దేశంలో రొమ్ము క్యాన్సర్ రోగుల్లో 50-70% మంది మూడు, నాలుగో దశలో వైద్యులను సంప్రదిస్తున్నారు. క్యాన్సర్ ముదిరిన దశలలో వైద్యులను సంప్రదించడం ద్వారా చికిత్సలో ఆలస్యం కావడంతో తీవ్ర ప్రభావం పడుతున్నట్టు అధ్యయనం వెల్లడించింది. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడం, సరిపడా మామోగ్రఫీ సౌకర్యాలు, వ్యవస్థీకృత స్క్రీనింగ్ కార్యక్రమాలు లేకపోవడంతోపాటు ఖర్చుల అడ్డంకులతో ఆశించిన మేర స్క్రీనింగ్ జరగడం లేదని స్టడీ స్పష్టంచేసింది. గ్రామీణ, పట్టణ వ్యత్యాసాలు ఈ సవాళ్లు మరింత పెంచుతున్నాయని వివరించింది.
ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ) అనే అంతర్జాతీయ సంస్థ రొమ్ము క్యాన్సర్‌కు కారకాలను గుర్తించింది. వీటిలో అయానైజింగ్ రేడియేషన్, ఈస్ట్రోజెన్-ప్రొజెస్టిరాన్ చికిత్సలు, ఆల్కహాల్, పర్యావరణ విషపదార్ధాలు, షిఫ్ట్ పని వేళలు/రాత్రి పూట వెలుతురు, ధూమపానం ఉన్నాయి. ఊబకాయం, అధిక పని గంటలు, అధిక కేలరీల ఆహారం, తగ్గిన శారీరక శ్రమతో కూడిన జీవన శైలి హైదరాబాద్‌లో పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్‌కు కారణాలని అధ్యయనం పేర్కొంది. రుతుక్రమం ఆగిపోయిన తర్వాత మహిళల్లో ఊబకాయం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని 30-40% పెంచుతున్నదని తెలిపింది. ప్రభుత్వాలు మొబైల్ స్క్రీనింగ్ క్యాంపులకు నిధులు కేటాయించడంతోపాటు, మామోగ్రఫీ పరీక్షకు రాయితీలు ఇవ్వాలని అధ్యయనంలో వైద్యనిపుణులు సూచించారు. ఈ మేరకు మహిళా ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఫలితాలు వస్తాయని అభిప్రాయపడింది.
రొమ్ము క్యాన్సర్‌ను ముందుగా గుర్తించేందుకు 40 ఏండ్లు దాటిన మహిళలు ఏడాదికి ఒకసారి మామోగ్రఫీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎలాంటి లక్షణాలు లేకున్నా.. పరీక్ష చేయించుకోవడం మంచిది. తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయొచ్చు. మారుతున్న జీవనశైలి కారణంగా కేసులు పెరుగుతున్నాయి. మహిళలు రోజు వారీగా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. అధిక కేలరీల ఆహారం తీసుకోవద్దు. ఊబకాయం రాకుండా జాగ్రత్త పడాలి.
-డాక్టర్ సాయినాథ్ బేతనబొట్ల మెడికల్ ఆంకాలజీ, స్టార్ట్ హాస్పిటల్స్