హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే సింబల్స్ టీఆర్ఎస్ గుర్తు కారును పోలి ఉంటున్నాయని, అలాంటి వాటిని కేటాయించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని టీఆర్ఎస్ చేసిన న్యాయపోరాటంలో థర్డ్‌పార్టీ జోక్యం చేసుకొనేందుకు జరిగిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. టీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన రిట్‌పై మంగళవారం విచారణ ప్రారంభం కాగానే న్యాయవాది బీ రచనారెడ్డి లేచి ఈ కేసులో తమ వాదనలు వినిపించేందుకు అనుమతించాలని కోరారు. తాము ఇంప్లీడ్ పిటిషన్ దాఖలుచేశామని, ఐదో ప్రతివాదిగా తమ వాదనలు వినాలని కోరారు. ఇందుకు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక రాజకీయ పార్టీ వ్యవహారంలో మీరెలా ఇంప్లీడ్ అవుతారని ప్రశ్నించింది. ఇంప్లీడ్ అయ్యేందుకు తాము అనుమతించబోమని తేల్చి చెప్పిం ది.
టీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన కేసులో ప్రతివాదిగా కూడా లేరని, మీరెలా ఇంప్లీడ్ కావాలని కోరతారని ప్రశ్నించింది. పిటిషనర్ వాదనలనే తాము అనుమతిస్తామని తేల్చి చెప్పింది. ఇతరులను వాదించడానికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. దీంతో రచనారెడ్డి తన ప్రయత్నాన్ని విరమించుకొన్నారు. టీఆర్ఎస్ రిట్‌పై వాదనలు ముగిసేదశలో సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఇది రాజకీయ అంశంతో ముడిపడిన కేసు అయినప్పటికీ మరో పార్టీకి చెందిన న్యాయవాది ఈ కేసులో వాదించే ప్రయత్నం చేయడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిని బట్టి ఫ్రీ సింబల్స్ వ్యవహారంలో ఏం జరుగుతున్నదో అర్థం అవుతున్నదని వ్యాఖ్యానించారు. తాము మూడో పార్టీ వాదనలకు అనుమతించలేదని చెప్పామని హైకోర్టు గుర్తు చేయగా, ఈ కేసుతో సంబంధం లేని ఆ రాజకీయ పార్టీ జోక్యం వెనుక ఉన్న అనుమానాలను ప్రస్తావించదల్చినట్టు శ్రీరఘురాం చెప్పారు.