హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) బదిలీలకు బ్రేక్ పడింది. ఇప్పుడున్న చోటు నుంచి కదలబోమని చాలామంది ఎంపీడీవోలు భీష్మించడంతో బదిలీల్లో ప్రతిష్ఠంభన నెలకొన్నది. గత ఏడాది జూన్లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 399 మంది ఎంపీడీవోలను ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
ఎన్నికలు ముగిసిన తర్వా త మళ్లీ పూర్వస్థానాలకు బదిలీ చేయాల్సి ఉన్నది. తహసీల్దార్లను యథాస్థానాలకు బదిలీ చేశారు కానీ, ఏడాది దాటినా ఎంపీడీవోలను మాత్రం ప్రభుత్వం బదిలీ చేయలేదు. దీంతో తెలంగాణ ఎంపీడీవో ల సంఘం నేతలు బదిలీల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి సీతక్క ఆదేశంతో బదిలీ దరఖాస్తుల అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
బదిలీ అయిన 399 మంది ఎంపీడీవోల్లో 40 మంది వరకు ఉద్యోగ విరమణ పొందారు. మరో 36 మంది స్పౌజ్ కోటాలో స్థానచలనం పొందారు. మిగిలిన 200 మందికిపైగా బదిలీ కోసం ఎదురుచూస్తున్నారు. ఏ జిల్లాకైనా వెళ్లడానికి సిద్ధమని 60 మంది దరఖాస్తు చేసుకున్నారు. మిగతా 100-150 మంది వరకు డైలమాలో ఉన్నారు.