హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వశాఖల హెచ్వోడీల నుంచి సచివాలయంలోకి 12.5% కోటాకు బ్రేక్లు పడ్డాయి. ఈ కోటాను పునరుద్ధరిస్తూ జారీచేసిన ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు విడుదల చేసే వరకు ఈ నెల 14న ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేసింది. ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా, ఈ గడువుకు ఒక్కరోజు ముందు దీనికి కూడాప్రభుత్వం బ్రేక్ వేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వశాఖల కమిషనరేట్లు, డైరెక్టరేట్ల నుంచి సచివాలయంలోకి 12.5% కోటాను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 200కుపైగా హెచ్వోడీలున్నాయి. వీటిల్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్లను సచివాలయం లో సెక్షన్ ఆఫీసర్లుగా తీసుకుంటారు. ఇలా 12.5% సిబ్బందిని తీసుకునేందుకు ప్రభు త్వం అనుమతినిచ్చింది. సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు దీనిని వ్యతిరేకించారు.