హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్‌బజార్: బ్రాహ్మణుల వెనుకబాటుకు ఉన్న పలు కారణాల్లో ఐకమత్యం లేకపోవడం ప్రధానమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్న చాలామంది తాము బ్రాహ్మణులమని చెప్పుకునేందుకు భయపడుతుంటారని, కులం ముద్ర వేస్తారేమోననే ఉద్దేశంతో తోటి బ్రాహ్మణుడికి న్యాయంగా చేయాల్సిన సహాయం కూడా చేసేందుకు వెనుకాడుతుంటారని చెప్పారు. ఆయా రంగాల్లో బ్రాహ్మణులకు తగిన సహకారం అందించేందుకు అన్ని రంగాలవారు కలిసి సంయుక్తంగా ఒక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.
బ్రాహ్మిణ్ ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ అబిడ్స్‌లోని స్టేట్ మైనింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవనంలో చర్చాగోష్టి నిర్వహించారు. సమావేశంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తనయుడు పీవీ ప్రభాకర్‌రావు, తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, మాజీ పోలీస్ అధికారి చంద్రమౌళి, కన్వీనర్ బీఆర్ సుశీల్‌కుమార్, అధ్యక్షుడు బీ రాధాకృష్ణమూర్తి, ఎస్వీ రావు, విష్ణుదాస్ శ్రీకాంత్, కామరాజు నరేంద్రకుమార్, యమున పాఠక్, హెచ్ శ్రీనివాస్‌రావు, ప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐలు తాము జన్మించిన కులానికి తమకు తోచినవిధంగా సహాయం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని పేర్కొన్నారు. సంఘటితంగా ఉంటే రాజకీయాల్లో ప్రాధాన్యం లభిస్తుందని చెప్పారు.
పలు నియోజకవర్గాల్లో నిర్ణాయక శక్తి
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో బ్రాహ్మణుల జనాభా గెలుపు ఓటమిలను నిర్ణయించే స్థాయిలో ఉన్నప్పటికీ సంఘటితంగా లేకపోవడం, ఓటింగ్‌లో పాల్గొనకపోవడం వల్ల నిరాదణకు గురవుతున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు. చదువుకున్నవారు, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడినవారు ఓటింగ్‌లో పాల్గొనకపోవడం, సామాజిక కార్యాక్రమాలకు దూరంగా ఉండటం వల్ల సమాజంలో వారికి గుర్తింపులేకుండా పోయిందని విశ్లేషించారు. దయనీయ పరిస్థితుల నుంచి బ్రాహ్మణ సమాజాన్ని బయటకు తీయాల్సిన బాధ్యత ఉన్నతస్థానాల్లో ఉన్న బ్రాహ్మణులదేనని పిలుపునిచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు.