హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ నేతృత్వంలోని బృందం చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లింది. ఆయనతోపాటు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, సీనియర్ జర్నలిస్టు అశోక్ టంకశాల, అంతర్జాతీయ జల నిపుణుడు డాక్టర్ భిక్షం గుజ్జాతో కూడిన బృందం ప్రస్తుతం ఆ దేశంలో పర్యటిస్తున్నది. సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాల సందర్శనతోపాటు విద్య, పరిశోధన సంస్థలు, ఆధునిక కార్ల తయారీ యూనిట్లను సందర్శిస్తున్నది. బీజింగ్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని శనివారం సందర్శించినట్టు వినోద్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తన పర్యటన తొలిదశలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఫర్బిడెన్ సిటీ, సమ్మర్ ప్యాలెస్, టెంపుల్ ఆఫ్ హెవెన్, బీజింగ్ ఓల్డ్ సిటీ, తియన్మాన్ స్వేర్ వంటి సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలను సందర్శించినట్టు పేర్కొన్నారు.
బీజింగ్ ఇంటర్నేషనల్ స్టడీస్ యూనివర్సిటీ, బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ, చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న బీజింగ్ జోంగ్నాంగ్ ఫుటాంగ్ హార్టికల్చర్ కంపెనీ లిమిటెడ్, షియోమి ఈవీ కార్ల తయారీ కర్మాగారం వంటి పలు ప్రముఖ సంస్థలను తాము సందర్శించినట్టు తెలిపారు. ఈ పర్యటనలో ప్రముఖ విద్యా, పరిశోధన సంస్థల్లో కూడా ఈ బృందం అధ్యయనం చేసింది. బీజింగ్ నార్మల్ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ సూల్ నిర్వహించిన చర్చల్లో తమ బృందం హాజరైనట్టు తెలిపారు. అంతర్జాతీయ జల నిపుణుడు డాక్టర్ గుజ్జా భిక్షం భారతీయ సందర్శకుల తరఫున చర్చల్లో పాల్గొన్నారని తెలిపారు. బీజింగ్ నుంచి జియాన్‌కు 1,100 కిలోమీటర్ల దూరాన్ని కేవలం నాలుగు గంటల్లో హైస్పీడ్ రైలులో ప్రయాణించామని వినోద్‌కుమార్ తెలిపారు.