ఎల్కతుర్తి, ఏప్రిల్ 9 : కేసీఆర్ ఆధ్వర్యంలో 2011 ఏప్రిల్ 27న గులాబీ జెండా పట్టుకొని టీఆర్ఎస్ పార్టీని స్థ్ధాపించినప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమ పార్టీది మూణ్నాళ్ల ముచ్చట అని వ్యంగ్యంగా మాట్లాడారని, కానీ నేడు అదే పార్టీ రజతోత్సవ సంబురాలకు సిద్ధమైందని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గులాబీ జెండా పట్టుకొని తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల్లో పర్యటించి సభలు, సమావేశాలు పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని తెలిపారు.
అనేక నిర్బంధాల మధ్య పుట్టుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఉధృత ఉద్యమాన్ని నిర్మించి 2014లో స్వరాష్ర్టాన్ని సాధించిందని గుర్తుచేశారు. 32 రాజకీయ పార్టీలను ఒప్పించి, కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ ఇవ్వక తప్పదనే నిర్ణయానికి తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టేలా చేసిన ఘనత గులాబీ జెండాదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ పాలక పగ్గాలు చేపట్టి దేశం మొత్తం మనవైపు చూసేలా నూతన ఒరవడితో అభివృద్ధి చేశారని కొనియాడారు. ఈ తరుణంలో గొప్ప బహిరంగ సభ ద్వారా ప్రజలను జాగృతం చేసేందుకు మంచి సందేశాన్ని కేసీఆర్ ఇవ్వనున్నారని వెల్లడించారు. ఇందుకు వేదికగా ఎల్కతుర్తిని ఎంచుకున్నామని, ఇందుకు స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. 27న జరిగే బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం నేషనల్ హైవేలపై వెంటనే చేపట్టాల్సిన పనుల గురించి చర్చించేందుకు ఎన్హెచ్ఏఐ రీజినల్ ఆఫీసర్‌ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లారు.