Boyalapalli Rekha : ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఖోకన్ చంద్ర దాస్‌ను సజీవ దహనం చేయడం దారుణమని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు బోయలపల్లి రేఖ (Boyalapalli Rekha) ఆవేదన వ్యక్తం చేశారు. విద్వేష రాజకీయాల దుష్పరిణామం కారణంగా ఖోకన్ చంద్ర దాస్ (khokan chandra das) హత్యకు గురికావడం దక్షిణాసియాను సిగ్గుపడేలా చేసిందని ఆమె పేర్కొన్నారు. భర్తను కోల్పోయిన సీమా దాస్ “మేమే ఎందుకు?” అని ప్రశ్నించడం, బంగ్లాదేశ్‌లో క్షీణించిన మానవతావిలువలకు అద్దం పడుతోందని రేఖ తెలిపారు.
ఖోకన్ చంద్ర దాస్ హత్యను ఒక చెదరుమదరు ఘటనగా కొట్టిపారేయలేమని, దక్షిణాసియాలో వేగంగా పెరుగుతున్న మతాధిక్యం, మెజార్టీ రాజకీయాల ఫలితంగానే ఈ హత్యోదంతాన్నిచూడాలని బోయలపల్లి రేఖఅన్నారు. ”మనదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ఆధారంగా సాగుతున్న పాలన విద్వేషాన్ని సాధారణ రాజకీయ ఆయుధంగా మార్చుతోంది. బుద్ధుడు, అంబేద్కర్, గాంధీ వంటి మహానుభావుల బోధనలతో కొత్త జీవం పోసుకున్న భారతదేశంలో మతోన్మాదం సాధారణమవ్వడం, సరిహద్దులు దాటి విద్వేషానికి చట్టబద్ధత కల్పించినట్లవుతోంద”ని రేఖ మండిపడ్డారు.
గత 12 ఏళ్లుగా భారత్‌లో మూకదాడులు, విద్వేష ప్రసంగాలు, మైనార్టీలైన ముస్లింలు, క్రైస్తవులపై లక్ష్యిత దాడులు, పౌరసత్వాన్ని మత గుర్తింపుగా మార్చే విధానాలు అధికమయ్యాయి. అలానే పేదలు, మైనార్టీల హక్కులను పరిరక్షిచాల్సిన రాజ్యాంగ సంస్థల మౌనం వహిస్తున్నాయి. 2014 తర్వాత భారత్‌లో విద్వేషపూరిత నేరాలు, సామాజిక అల్లర్లు, ప్రజాస్వామ్య వెనుకడుగు పెరిగాయని పౌరసమాజ నివేదికలు, అంతర్జాతీయ పరిశీలనా సంస్థలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇది ఒక సిద్ధాంతాన్ని అమలు చేసే క్రమంలో దేశ ప్రజలు అనుభవిస్తున్న ఫలితం.
ఆర్ఎస్ఎస్ ప్రేరిత హిందూత్వ రాజకీయాలు రాజకీయ ఆయుధంగా మారి.. మైనారిటీలపై శాశ్వత అనుమానితులనే ముద్ర వేస్తాయి. ఇలాంటి విద్వేష రాజకీయాలు భారత సరిహద్దుల వద్దనే ఆగవు. మనదేశంలో మైనారిటీలపై దాడులకు పురిగొల్పే వాతావరణమే, పొరుగుదేశాల్లో మైనార్టీలైన హిందువులపై దాడులకు ప్రేరణగా మారుతోంది. విద్వేషాన్ని ఎగుమతి చేసి, అది చివరకు హింసాత్మకంగా మారినప్పుడు మాకేం తెలియదని తప్పించుకోలేం. బంగ్లాదేశ్‌లో ఖోకన్ చంద్ర దారుణ హ్యతను తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇకనైనా ప్రభుత్వాలు విద్వేష రాజకీయాలను ప్రోత్సహించడం మానేయాలి. అప్పుడే అమాయకుల ప్రాణాలకు భద్రత ఉంటుంది” అని రేఖ వెల్లడించారు.
‘మతాధిక్య రాజకీయాల వల్లే మైనారిటీలు అసురక్షితంగా మారుతున్నారు. విద్వేషాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించే శక్తులే ఇలాంటి నేరాలకు నైతిక బాధ్యత వహించాలి. భారతదేశంలో లౌకిక, రాజ్యాంగ విలువలను కాపాడకపోతే, పొరుగుదేశాల్లోనూ మైనారిటీల భద్రత ప్రమాదంలో పడుతుంది. ప్రతి మైనారిటీ ప్రాణానికి సమాన విలువ ఉండాలి. మనదేశంలోనూ విదేశాల్లోనూ మహిళలు, కుటుంబాలు, మతపరమైన అల్పసంఖ్యాకులు భద్రంగా జీవించే హక్కును కాపాడటమే నిజమైన దేశభక్తి’ అని
మహిళా కాంగ్రెస్ స్పష్టం చేసింది.
“విశ్వగురు” అనే నినాదాల మధ్య లౌకికత్వం, చట్టపాలన, నైతిక నాయకత్వం క్షీణిస్తే ఖోకన్ చంద్ర దాస్ మాదిరి విషాదాలు చవిచూడాల్సి వస్తుంది. నిజమైన నాయకత్వం అంటే దేశంలోనూ, పొరుగుదేశాల్లోనూ ప్రతి మైనారిటీ ప్రాణానికి సమాన విలువ ఇవ్వడం. సోషల్ మీడియా ప్రకటనలతో కాదు.. విద్వేష రాజకీయాలను తిరస్కరించడమే ఖోకన్ చంద్ర దాస్‌కు నిజమైన నివాళి. భారత్‌లోనే కాదు బంగ్లాదేశ్‌లోనూ అధికారంలో ఉన్నవారు ప్రజల మధ్య విభజన చిచ్చను ఎన్నికల వ్యూహంగా మలిచే ధోరణికి తక్షణమే చరమగీతం పాడాలి’ అని బోయలపల్లి రేఖ పేర్కొన్నారు.