వరంగల్, మార్చి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మేడారం మహాజాతర తల్లుల గద్దెల ప్రాంగణంలో సర్కార్ చేపట్టిన సుందరీకరణ పనుల్లో లోపించిన నా ణ్యతకు అమాయకులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. సమ్మక్క పూజారుల్లో ఒకరైన సిద్దబోయిన రమేశ్ ఏడేండ్ల కుమారుడు యువిన్ తన స్నేహితులతో కలిసి బుధవారం గద్దెల ప్రాంగణంలో ఆడుకుంటుండగా సమ్మక్క గద్దెకు అతికించిన శిల రాలి కాలిపై పడటంతో ఆ బాలుడి ఎడమ పాదం నుజ్జునుజ్జు అయింది. బాలుడిని ములుగులోని ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖాన కు తీసుకెళ్లారు.
మరోవైపు ఘటనకు సంబంధించి బాలుడి సంబంధీకులను పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది ‘పై నుంచి అంతా మానిటర్ చేస్తున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడొద్దు’ అని హుకుం జారీ చేయడంతో వారు మౌనం దాల్చా రు. మేడారం మహాజాతర సందర్భంగా రేవంత్ సర్కార్ ఆగమేఘాల మీద చేపట్టిన పను ల్లో నాణ్యత లోపించి, జాతర ముగిసిన వారం రోజులకే శిలలు ఊడిపడ్డాయి. జాతర పనుల్లో నాణ్యతాప్రమాణాలకు రేవంత్ సర్కార్ తిలోదకాలు ఇచ్చిందని, ఆ క్రమంలోనే ‘తిరుగువారానికే విరిగిపోతున్న శిలలు, మేడారంలో రాలిపోతున్న రాతికట్టడాలు’ అని, ఫిబ్రవరి 4న, ‘మేడిపండులా మేడారం కట్టడాలు!’ అని ఫిబ్రవరి 5న నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని కాంగ్రెస్ నేతలు నమస్తే తెలంగాణపై అక్కసును వెళ్లగక్కిన విషయం తెలిసిందే.
మేడారం గద్దెల వద్ద ప్రభుత్వం చేపట్టిన నాసిరకం పనుల వల్లే బాలుడికి గాయాలయ్యాయని గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు సిద్దబోయిన సురేందర్ ఆరోపించారు. పనులు చేసేటప్పుడే నాణ్యతాప్రమాణాలు పాటిస్తే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.