కూసుమంచి, డిసెంబర్ 24 : స్కూల్లో ఆడుకుంటూ ఎనిమిదేళ్ల బాలుడు మృత్యువాతపడిన విషాద ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నాయకన్‌గూడెంకు చెందిన మేడారపు ఉపేంద్రాచారి- మౌనిక దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కుమారుడు విహార్ (8), కూతురు వర్షిత అదే గ్రామంలో ఓ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ, ఎల్కేజీ చదువుతున్నారు.
బుధవారం తల్లి మౌనిక విహార్, వర్షితకు లంచ్ బాక్స్ కట్టి స్కూలుకు పంపింది. సాయంత్రం 3:30 గంటలకు ఇంటర్వెల్ సమయంలో చేతిలో పెన్సిల్ పట్టుకున్న విహార్ స్నేహితులతో కలిసి గ్రౌండ్లో ఆడుకుంటున్నాడు. పరుగు తీస్తున్న సమయంలో బాలుడు ఒక్కసారిగా కిందపడగా చేతిలో ఉన్న పెన్సిల్ మొన ఛాతీలోకి చొచ్చుకెళ్లింది. తీవ్ర రక్తస్రావమై నొప్పితో విలవిల్లాడుతుంగా తోటి విద్యార్థులు గమనించి టీచర్లకు చెప్పారు. వారు వెంటనే వచ్చి ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి 108 వాహనంలో ఖమ్మం తీసుకెళ్తున్న క్ర మంలో తుదిశ్వాస విడిచాడు. కూసుమం చి ఎస్సై నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎంఈవో రాయల వీరస్వామి, పాఠశాల యాజమాన్యం, సర్పంచ్ కంచరి సైదమ్మ, ఉప సర్పంచ్ భీష్మాచారి, ప్రైవేట్ పాఠశాలల సంఘం బాధ్యులు, గ్రామస్తులు సంతాపం వ్యక్తంచేశారు.