బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించడం పట్ల మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని విమర్శించారు. స్వయంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పారని గుర్తుచేశారు. కానీ ఇవాళ స్పీకర్ మాత్రం పార్టీ మారలేదని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
పదో షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేయాలని.. పార్లమెంట్లో వెంటనే పార్టీ ఫిరాయింపులపై ప్రత్యేక చట్టం చేయాలని బోయిన్పల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పుతో సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టం పనికిమాలిన చట్టంగా తేల్చారని విమర్శించారు. రాజీవ్ గాంధీ తెచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్‌ను పనికిమాలిన చట్టంగా స్పీకర్, ఇదే కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు చెప్పిందన్నారు. పార్టీ ఫిరాయించి, స్పీకర్ దగ్గర పార్టీ ఫిరాయించలేదని చెప్తే సరిపోతుందని ఇవాళ స్పీకర్ ప్రసాద్ తీర్పు ఇచ్చారని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నీరుగార్చిందని.. పార్టీ ఫిరాయింపుల చట్టం పనికిమాలిన చట్టం కాంగ్రెస్ పార్టీ చెప్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ చంపేసిందని విమర్శించారు.