Uranium Mining | హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం నిల్వలను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న ప్రచారంతో నల్లమల అటవీ ప్రాంతంలోని పల్లెల్లో అలజడి మొదలైంది. తాజాగా యురేనియం నిల్వలను గుర్తించేందుకు అటమిక్ మినరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకో ఆపరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ 68 బోర్ల తవ్వకాలకు అనుమతి ఇచ్చిందన్న ప్రచారంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఆదోని రేంజ్ పత్తికొండ సెక్షన్ కప్పట్రాళ్ల ఫారెస్ట్ పరిధిలో 468.25 హెక్టార్ల అటవీశాఖకు చెందిన భూములు ఉన్నాయి. కౌలుట్లయ్యమలగా పిలిచే ఈ రిజర్వ్ ఫారెస్ట్ కప్పట్రాళ్ల, పీ కోటకొండ, మాదాపురం, చెల్లెలచెలిమిల, గుండ్లకొండ గ్రామాల మధ్య విస్తరించి ఉన్నది. ఆ కొండపైనే కౌలుట్లయ్యస్వామి ఆలయం ఉన్నది. ఈ ప్రదేశంలోనే సర్వే కోసం అనుమతులు వచ్చాయని, 6.8 హెక్టార్ల అటవీ భూమిలో బోర్‌వెల్స్ తవ్వకాలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సలహామండలి ఆమోదం లభించినట్టు ప్రచారం జరుగుతున్నది.
దీంతో ఆ ప్రాంత ప్రజలు యురేనియం తవ్వకాలను అడ్డుకోవడానికి సిద్ధమవుతున్నారు. వాస్తవంగా నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయని, దీనికి సంబంధించి సర్వే చేసేందుకు 2016 ప్రాంతంలో ప్రయత్నాలు జరిగాయి. కానీ అప్పట్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. తాజాగా అటమిక్ మినరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకో ఆపరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ నోటిఫై చేయడంతో మరోసారి రెండు తెలుగు రాష్ర్టాల్లో యురేనియం తవ్వకాలపై మళ్లీ అలజడి నెలకొన్నది.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో యురేనియం నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న దానిపై సర్వే చేపట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని కేంద్రం 2020 మేలో కోరింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ అటవీ సలహా మండలి సమావేశంలో ఏటీఆర్ పరిధిలో ప్రతిపాదిత యురేనియం నిల్వల సర్వే, వెలికితీత అంశం చర్చకు వచ్చింది. ఈ విషయంపై రాష్ట్ర వన్యప్రాణి మండలి నిర్ణయమేమిటో నివేదిక రూపంలో తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ కోసం 200, 300 మీటర్ల లోతున అటవీ ప్రాంతవ్యాప్తంగా నాలుగు వేల బోర్లు వేస్తామని, దాదాపు ఐదేండ్లపాటు ఈ సర్వే ప్రక్రియ సాగించేందుకు అనుమతివ్వాలంటూ 2019లో అటమిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ) నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. 2016 నాటి ప్రతిపాదనకు భిన్నంగా ఈ కొత్త ప్రతిపాదన ఉండటంతో తెలంగాణ అటవీ సలహా మండలి తిరస్కరించింది. ఈ కొత్త ప్రతిపాదనలను పరిశీలించలేమని, వీటివల్ల అడవితోపాటు జంతువులు, వృక్షాలకు నష్టం వాటిల్లుతుందని తెలంగాణ అటవీశాఖ స్పష్టం చేసింది.
దీంతో ఏటీఆర్ పరిధిలో యురేనియం తవ్వకాలపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వెనక్కి తగ్గింది. తాజాగా ఏపీలోని కప్పట్రాళ్ల అటవీప్రాంతలో యురేనియం తవ్వకాల కోసం అనుమతివ్వడంతో మళ్లీ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో కూడా అనుమతులు ఇస్తారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వికారాబాద్ జిల్లాలో దామగుండం నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు ఆందోళనలు చేసినప్పటికీ పట్టించుకోకుండా.. రాష్ట్ర ప్రభుత్వం నేవీ రాడార్ పనులకు శంకుస్థాపన చేసింది. ఈ నేపథ్యంలో నల్లమలలో యురేనియం తవ్వకాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.