హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేస్తూ రూపొందించిన ఓ బుక్లెట్ సంచలనంగా మారింది. వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి పాత్ర ఉందంటూ మొదటి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ‘వైఎస్ కోటలోనే వైఎస్ వివేకాను హత్య చేయడం అంతఃపుర అధినేత అండ లేకుండా సాధ్యమా?’ అనే ట్యాగ్‌లైన్‌తో బుక్‌లెట్‌ను టీడీపీ వర్గాలు సామాజిక మాధ్యమాల్లో పెట్టినట్టు సమాచారం. గొడ్డలి వేటును ..గుండె పోటుగా ఎందుకు ప్రచారం చేశారు? రూ.40 కోట్ల సుపారీ ఇచ్చే స్తోమత ఎవరికి ఉన్నది? సాక్షి మీడియా ఎందుకు నిందితులకు కొమ్ము కాస్తున్నది? సిట్ విచారణను నీరుగార్చింది జగన్‌రెడ్డి కాదా? సీబీఐ విచారణ కోరిన జగన్‌రెడ్డి, హైకోర్టులో పిటిషన్ ఎందుకు ఉపసంహరించుకున్నారు? పెద్దల భరోసా లేకుండా నిందితులు సీబీఐని బ్లాక్ మెయిల్ చేయగలరా? సానుభూతి ఓట్ల కోసం కోడికత్తి వలే, వివేకాను హత్య చేయించారా? నారాసుర రక్త చరిత్ర అని నేర చరిత్ర లేని చంద్రబాబుకు మీ రక్తం పులిమే కుట్ర చేయలేదా? సూత్రధారుల్ని బోనులో నిలబెట్టకపోతే రాష్ట్రంలో ఎవరి ప్రాణాలకైనా రక్షణ ఉన్నదా? అంటూ పుస్తకంలో ప్రశ్నలు సంధించారు. సీబీఐ చార్జిషీట్‌ను 18 పేజీల్లో ముద్రించారు.