రాష్ట్రవ్యాప్తంగా రైతులకు నేటి నుంచి యూరియా కష్టాలు మొదలుకానున్నాయి. యూరియా బుకింగ్ విధానం శనివారం నుంచి అమల్లోకి రానున్నది. ఇకపై ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’లో బుక్ చేసుకున్నవారికే యూరియా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే సాధారణ విధానంలో పంపిణీ నిలిపివేసింది. యాప్‌ను ఎలా వినియోగించాలో రైతులకు ఏమాత్రం అవగాహన కల్పించకుండానే నేరుగా అమల్లోకి తేవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరక్షరాస్యులైన రైతులు ఈ యాప్‌ను వినియోగించడం ఎలా సాధ్యమన్న ప్రశ్న తలెత్తుతున్నది. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా హైదరాబాద్‌లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి .
Urea | హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): సాధారణంగా ప్రభుత్వం ఏదైనా కొత్త విధానాన్ని అమలు చేయాలంటే.. ముందుగా దానిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి. ఎలా వినియోగించాలో, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో వివరించాలి. వీలైతే పైలట్ ప్రాజెక్టు చేపట్టి, దాని ఫలితాలను బట్టి మార్పులు, చేర్పులు చేసుకోవాలి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా బుకింగ్ (Urea Booking App) విధానాన్ని రైతులపై పిడుగులా పడేసింది. శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నది. ఇందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. దీంతో ఇకపై ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’లో (Fertilizer Booking App) బుక్ చేసుకుంటేనే యూరియా బస్తాలు ఇస్తారు. ఇప్పటికే సాధారణ పద్ధతిలో యూరియా పంపిణీని అధికారులు నిలిపేశారు. యూరియా కొరతతో దుకాణాల ముం దు రైతుల క్యూలు, చెప్పులు, పాస్బుక్ల క్యూలు కనబడకుండా చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానంతో అన్నదాతల కష్టాలు రెట్టింపు కానున్నాయి. యూరియా కోసం ప్రభుత్వాన్ని, యాప్‌లో బుకింగ్ కోసం మరొకరిని బతిమాలుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శనివారం నుంచి ప్రతి రైతు తమ ఫోన్లలోనో లేక తెలిసిన వారి ఫోన్లలోనో యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో అడిగే వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత రైతుకున్న మొత్తం భూమి, సాగు చేస్తున్న భూమి, పంట రకాల ఆధారంగా యూరియా బస్తాలు కేటాయిస్తారు. ఈ బస్తాలను కొనుగోలు చేయడానికి మరోసారి యాప్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు బుకింగ్ ఐడీ వస్తుంది. రైతులు ఎరువుల దుకాణాల వద్దకు వెళ్లి ఆ ఐడీని చెప్పి యూరియా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బుకింగ్ యాప్ అమలు చేయాలన్న నిర్ణయాన్ని వ్యవసాయ శాఖ చాలా సులువుగా తీసుకున్నది. అయితే అమలుకు ముందు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయడం మాత్రం మరచిపోయింది. ఇంతటి కీలక నిర్ణయం తీసుకునే సమయంలో రైతులను భాగస్వాములను చేయాలి. కానీ వారిని గాలికొదిలేసి వ్యవసాయ శాఖ అధికారులే సొంతంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానంపై రైతులకు ఇప్పటివరకు అవగాహన కల్పించలేదు. ఎలాంటి అవగాహనా సదస్సులు నిర్వహించలేదు. అంతా హైదరాబాద్‌లో ఆఫీసుల్లో కూర్చొని మీటింగ్‌లపై మీటింగ్‌లు పెట్టుకుంటూ అమలు చేస్తున్నారే తప్ప.. ఆ యాప్‌ను ఉపయోగించే రైతులను మాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు చేసే తప్పిదాలకు రైతులు ఇబ్బందులు పడాలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
యూరియా బుకింగ్ యాప్ బాధ్యతను ఉన్నతాధికారులు ఏఈవోలు, డీలర్లపైనే మోపారు. యాప్ పనిచేసే విధానంపై ఏఈవోలు, డీలర్లకు అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో అవగాహన కల్పించారు. అయితే నేరుగా యాప్ అందుబాటులో లేకపోవడంతో మెజారిటీ ఏఈవోలు, డీలర్లకు దానిని ఎలా వినియోగించాలనే అంశంపై స్పష్టత రాలేదని చెప్తున్నారు. నిరక్షరాస్యులైన రైతులు యూరియా బుకింగ్ కోసం ఏఈవోలు, డీలర్లపై ఆధారపడాల్సి వస్తుంది. వారు దయతలచి బుక్ చేస్తేనే యూరియా అందుతుందని చెప్తున్నారు. ఒకవేళ బుకింగ్ చేయకపోతే రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొన్నది.
బుకింగ్ యాప్ విధానంతో రైతులకు యూరియా కష్టాలు రెట్టింపు అవుతాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రెండేండ్లుగా రైతులకు అవసరమైన యూరియాను అందించడంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యాయి. ఇటీవల వానకాలంలో యూరియా కోసం రైతులు పడ్డ అవస్థలు, కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క బస్తా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ యాసంగిలోనూ యూరియా కష్టాలు తప్పవని అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి డిసెంబర్లో 4 లక్షల టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం 2.5 లక్షల టన్నులు మాత్రమే ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. జనవరి, ఫిబ్రవరిలో రెండు నెలల్లోనే ఏకంగా 6.5 లక్షల టన్నుల యూరియా కావాలి. అయితే ఇంత భారీ మొత్తంలో సరఫరా చేసే పరిస్థితి లేదని సమాచారం. దీంతో ఈ సీజన్లోనూ యూరియా కష్టాలు తప్పవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బుకింగ్ కోసం అవగాహన లేని రైతులు వేరేవారిని బతిమాలుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా కోసం యాప్ బుకింగ్ విధానాన్ని అమలు చేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇవన్నీ మాకేం తెలుస్తాయి? ఈ సర్కారుకేం పనిలేదా?’ అంటూ మండిపడుతున్నారు.
వానకాలంలో యూరియా కోసం రైతులు యుద్ధమే చేశారు. తీవ్రమైన యూరియా కొరతతో ఎక్కడ చూసినా క్యూలే కనిపించాయి. మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కండ్ల ముందుకొచ్చాయి. ఏ ఎరువుల దుకాణం వద్ద చూసినా రైతులు, చెప్పులు, పాస్ పుస్తకాల క్యూలు కనిపించాయి. రైతులు రోజుల తరబడి దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరియా కొరత పల్లెల్లో రక్తాన్ని పారించింది. కొన్నిచోట్ల రైతుల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరిగాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యంపై సర్వత్రా చర్చ జరిగింది. ప్రస్తుత నిల్వలు, సరఫరా ప్రకారం యాసంగిలోనూ ఇదే పరిస్థితి వస్తుందని ప్రభుత్వం ముందే ఊహించింది. రైతుల, చెప్పుల క్యూలు కనిపించకుండా చేసేందుకు ‘బుకింగ్ యాప్’ను తెరమీదికి తెచ్చింది. తద్వారా రైతులు ఒక్కసారిగా దుకాణాల వద్దకు వెళ్లకుండా నిలువరించాలని భావిస్తున్నది. బుక్ అయినవారు దుకాణాల వద్దకు వెళ్తే, ఏదేని కారణంతో బుక్ కాని రైతులు ఇండ్ల వద్ద నిరీక్షించాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇలా యూరియా కొరత కనిపించకుండా మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నమని స్పష్టం చేస్తున్నారు.
వనపర్తి, డిసెంబర్19 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లా వ్యవసాయాధికారి ఆంజనేయులుగౌడ్ రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని ఓ ఆగ్రోరైతు సేవా కేంద్రానికి యూరియా కేటాయించేందుకు డీవోఏ రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. 3వేలు అడ్వాన్స్‌గా తీసుకొని, మరో రూ.10వేలు శుక్రవారం ఆగ్రోసేవా రైతు యజమాని నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.