శంషాబాద్ రూరల్, నవంబర్ 16 : శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బ్యాంకాక్ వెళ్తున్న విమానంలో బాంబు బెదిరింపు కళకళం రేపింది. సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి తెల్లవారుజామున 2 గంటలకు బ్యాంకాక్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన వెంటనే ఓ ప్రయాణికుడు తన వద్ద బాంబు ఉందంటూ గట్టిగా అరిచాడు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పైలెట్ ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న ఎయిర్‌లైన్స్ అధికారులతో పాటు సీఐఎస్ఎఫ్, ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికులను కిందకుదింపి పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి ఎలాంటి బాంబులేదని తేల్చారు. బాంబు ఉందంటూ అరచిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలోని పాకాలపాడుకు చెందిన సుధాకర్‌గా గుర్తించారు.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామం వద్ద వైరా నదిపై చెక్‌డ్యామ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.4.71కోట్లతో పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.