గతంలో ఎన్నోసార్లు హైదరాబాద్ వచ్చాను. కానీ ఇంత అభివృద్ధిని గతంలో చూడలేదు. 1990-2000 మధ్యకాలంలో చూసిన హైదరాబాద్‌కు ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. ఇక్కడున్న అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చూస్తుంటే ఇక్కడే స్థిరపడాలని అనిపిస్తున్నది.
– సన్నీడియోల్
BJP MP Sunny Deol | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ను చూస్తుంటే తనకు విదేశీ నగరాలు గుర్తొస్తున్నాయని బాలీవుడ్ ప్రముఖ నటుడు, గురుదాస్‌పూర్ బీజేపీ ఎంపీ సన్నీడియోల్ ప్రశంసించారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన హైదరాబాద్ అభివృద్ధికి ఫిదా అయిపోయారు. షూటింగ్ కోసం, ప్రచార కార్యక్రమాల కోసం తాను గతంలో ఎన్నోసార్లు హైదరాబాద్ సందర్శించానని, అప్పటి హైదరాబాద్‌కు, ఇప్పటి హైదరాబాద్ ఎంతో తేడా ఉన్నదని పేర్కొన్నారు. 1990-2000 మధ్య చూసిన హైదరాబాద్‌కు, నేటి నగరానికి బోల్డంత వ్యత్యాసం ఉన్నదని కొనియాడారు. ఇక్కడి అభివృద్ధిని చూస్తుంటే ఇక్కడే స్థిరపడిపోవాలని అనిపిస్తున్నదంటూ మనసులో మాట బయటపెట్టారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతూ విశ్వనగరంగా ఖ్యాతినార్జించిన హైదరాబాద్‌పై ఇప్పటికే పలువురు సినీతారులు మనసు పారేసుకున్నారు. నగరాన్ని చూసి ‘అయ్యో.. ఇక్కడ ఉండలేకపోతున్నామే’ అని బాధపడుతున్నారు. విదేశాల్లో ఉండివచ్చిన వారు సైతం మారిన భాగ్యనగర రూపురేఖలు చూసి ముచ్చటపడుతున్నారు. విశాలమైన రోడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాలతో భూతల స్వర్గంగా మారిన నగరాన్ని చూసి మైమరచిపోతున్నారు. ఇప్పుడీ జాబితాలోకి సన్నీడియోల్ వచ్చి చేరారు.
హైదరాబాద్ అభివృద్ధిపై తమిళ తలైవా రజనీకాంత్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. తాను ఇండియాలోనే ఉన్నానా? అంటూ ఆశ్చర్యపోయారు. 22 ఏండ్ల తర్వాత ఇటీవల షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు నైట్ టైం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వైపు వెళ్తే తానున్నది ఇండియాలోనా? న్యూయార్క్లోనా? అన్న అనుమానం కలిగిందని చెప్పుకొచ్చారు. తాను ఒకప్పుడు చూసిన హైదరాబాద్‌కు, ఇప్పటి హైదరాబాద్‌కు పొంతనేలేదని వివరించారు. టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదిగిన లయ కూడా హైదరాబాద్ నగరాభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయారు. పెండ్లి తర్వాత అమెరికాలో స్థిరపడిన ఆమె ఇటీవల హైదరాబాద్ వచ్చారు. అత్యాధునిక హంగులతో, ఆకాశహర్మ్యాలతో, అడుగడుగునా కనిపిస్తున్న అభివృద్ధితో తొణికిసలాడుతున్న నగరాన్ని చూసి.. హైదరాబాద్‌లో ఉంటే లాస్ఏంజెలెస్లోనే ఉన్నట్టు ఉందని ప్రశంసించారు.
బాలీవుడ్ ప్రముఖ నటి సోనాల్ చౌహాన్ కూడా హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని అనిపిస్తోందని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ వస్తుంటే ఎత్తైన ఆకాశహర్మ్యాలు, విశాలమైన రోడ్లు, అభివృద్ధి చూసి ముచ్చటేసిందని, ఏదో విదేశాల్లో ఉన్న ఫీలింగ్ కలిగిందని చెప్పుకొచ్చారు. ఇంతగా అభివృద్ధి చెందిన నగరాన్ని తాను దేశంలోనే చూడలేదంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు, ఇక్కడ అభివృద్ధి చూస్తుంటే తనతోపాటు మరెంతోమంది బాలీవుడ్ నటీనటులకు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని అనిపిస్తోందని పేర్కొన్నారు.
తమిళనాడులో స్థిరపడిన టాలీవుడ్ నటుడు శ్రీరాం సైతం తాను గతంలో చూసిన హైదరాబాద్ ఇది కాదని చెప్పారు. అతి తక్కువ కాలంలోనే నమ్మలేనంతగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని వివరించారు. ఇప్పుడీ జాబితాలోకి సన్నీడియోల్ వచ్చి చేరారు. వీరేకాదు, బ్రిటన్ ఎంపీ వీరేంద్రశర్మ, ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు, ఆదిత్య థాకరే, ఛత్రపతి శివాజీ మునిమనవడు శంభాజీరాజే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ప్రముఖులు హైదరాబాద్ నగరాభివృద్ధిని చూసి మైమరచిపోతున్నారు.
హైదరాబాద్‌పై ప్రముఖ ప్రశంసలు విపక్షాలకు చెంపపెట్టులా మారుతున్నాయి. నగరానికి వచ్చే సినీ, వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఇక్కడ అభివృద్ధిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత అనతికాలంలో ఇంత అభివృద్ధా? అని ఆశ్చర్యపోతున్నారు. గడిచిన తొమ్మిదేండ్లలో చారిత్రక నేపథ్యం ఉన్న మహానగరంలో చోటుచేసుకున్న అభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులు, అంతర్జాతీయస్థాయి నిర్మాణ శైలి, గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఒకప్పుడు చూసిన పాతనగరం, ఇప్పుడున్న మాడ్రన్ హైదరాబాద్‌ను చూసి తామున్నది గ్లోబల్ సిటీలోనేనని మురిసిపోతున్నారు.
అంతర్జాతీయస్థాయి కంపెనీలు, పెట్టుబడులను ఆకర్షించాలంటే ఆ స్థాయికి తగిన మౌలిక వసతులు ఉన్నప్పుడే సాధ్యం అవుతుందని సీఎం కేసీఆర్ భావించారు. ఆ దిశగా దృష్టిసారించి విజయం సాధించారు. ఈ క్రమంలో గడిచిన తొమ్మిదేండ్లలో లెక్కలేనన్ని కంపెనీలు నగరంలో కాలుమోపాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యాచరణతోనే రియలిస్టిక్ గ్రోత్ సాధ్యమవుతున్నదని నిపుణులు చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో కొత్తగా ప్రారంభించిన పరిశ్రమ ప్రారంభోత్సవానికి హాజరైన బాబా టెక్స్టైల్ మెషినరీ బిజినెస్ హెడ్ కేశవ్ అగర్వాల్ తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిని ప్రశంసించారు. రాష్ట్రంలో టెక్స్టైల్ మెషినరీ పరిశ్రమ వ్యాప్తికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం అమోఘమని కొనియాడారు.