దేశ యువతలో ఆందోళనకు కారణమవుతున్న అగ్నిపథ్ స్కీంను కేంద్ర సర్కారు వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు దేశ భద్రత భద్రతకు పెను ముప్పుగా మారనున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. అగ్నిపథ్ వల్ల వల్ల దేశంలో యువత ఆందోళన చెందుతోందని, అశాంతితో రగిలిపోతున్న యువతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
లాభాల బాటలో నడుస్తున్న రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, బ్యాంకులు, బీహెచ్ఈఎల్, ఆయిల్ కంపెనీలు, ఈసీఐఎల్లాంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని వినోద్‌కుమార్ మండిపడ్డారు. ఇందులో భాగంగానే అత్యంత కీలకమైన ఆర్మీలో సైతం ప్రైవేటీకరణ చేసేందుకు ప్రధాని మోదీ పావులు కదుపుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. జై కిసాన్.. జై జవాన్ నినాదం దేశంలో ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని, ఇప్పుడు ఈ నినాదాన్ని మోదీ నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ చర్యలు దేశంలో నిరుద్యోగాన్ని మరింతగా పెంచేలా ఉన్నాయన్నారు.