కరీంనగర్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మేడిగడ్డ మరమ్మతులను వెంటనే చేపట్టాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాయడంతోపాటు సదరు లేఖను శనివారం కరీంనగర్లో విలేకరుల సమావేశంలో విడుదల చేసి మాట్లాడారు. మేడిగడ్డ మరమ్మతులకు నేషనల్ సేఫ్టీ డ్యాం అనుమతులు అవసరం లేదని ఆ చట్టమే చెపుతున్నదన్నారు. ఇకనైనా వెంటనే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని అవేదన వ్యక్తంచేశారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా వెంటనే ప్రాణహిత నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయని, దీనిని సద్వినియోగం చేసుకొని ఎండిపోతున్న పంటలను కాపాడాలని కోరారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టులో యాసంగి పంటకు నీళ్లు ఇవ్వలేమని గత డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో ప్రకటన చేయించిందని, తాజాగా రైతు సమితి చైర్మన్ కోదండరెడ్డి పంటలు వేయొద్దని రైతులకు సూచనలు చేస్తున్నారని, ఇదంతా చూస్తుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని వినోద్‌కుమార్ విమర్శించారు. నీళ్లు ఇవ్వలేమని చెప్పడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా పంట దిగుబడి సాధించామని మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక బ్యారేజీలో నీళ్లు నిల్వ చేయకపోయినా మిగతా ప్రాజెక్టుల ద్వారా రైతులకు నీళ్లు అందుతున్నాయన్న విషయాన్ని మర్చిపోవడం హాస్యాస్పదమని విమర్శించారు.
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గత పదేండ్లలో రికార్డు స్థాయిలో వరి దిగుబడిని పెంచితే… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే కనీసం పంటకు నీళ్లు ఇవ్వలేని దుస్థితిని తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పూర్తి బాధ్యత డ్యామ్ ఓనర్దేనని ఆ చట్టం స్పష్టంగా చెపుతుంటే.. మరమ్మత్తులు చేయకుండా ప్రభుత్వం బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టం ప్రకారం రాష్ట్రంలోనూ స్టేట్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఉన్నదన్న విషయాన్నే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
అందులోనూ నిపుణులైన ఇంజినీర్లు ఉన్నారని, కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా లాంటి నిపుణులు సలహాదారులుగా ఉన్నారని, సూచనలు, సలహాల కోసం మాత్రమే నేషనల్ అథారిటీ ఉన్నదన్న విషయం ముఖ్యమంత్రికి, మంత్రులకు తెలిసి కూడా కాలయాపన చేయడం రైతులను దగా చేయడమేనంటూ మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి లేఖ రాసి ఈ అంశాన్ని రాష్ట్ర పరిధి నుంచి కేంద్ర పరిధిలోకి తీసుకెళ్లారని విమర్శించారు.
వారు కోరిన విధంగానే నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికను వండి వార్చిన సంగతి తెలిసిందేనని, ఫలితంగా రైతుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందని, ఇదంతా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిర్వాకమేనని ఎద్దేవాచేశారు. సాగునీటి అధికారులు, స్టేట్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులతోచర్చించి.. బ్యారేజీల శాశ్వత మరమ్మతులు పూర్తిచేసి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చి, రానున్న రోజుల్లోనైనా రైతులకు నీళ్లందించే కార్యాచరణకు పూనుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.