వేములవాడ, జనవరి 9: ‘తమ్ముళ్లూ ఎలా ఉన్నా రు? ఏంచేస్తున్నారు?’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ యువకులతో చిట్‌చాట్ చేశారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో వేములవాడలోని గీతా భవన్ హోటల్ వద్ద ఆగారు. చాయ్తాగుతూ అక్కడి యువకులతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగారు. 2018లో జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎన్పీడీసీఎల్లో ఏఈగా ఉద్యోగం పొందానని రేగుల సంతోష్ కుమార్ అనే యువకుడు చెప్పాడు. అప్పట్లో పైరవీలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయని, కానీ తనకు మాత్రం మెరిట్ ప్రకారమే ఉద్యోగం వచ్చిందని తెలిపారు. ప్రవేశ పరీక్షలు త్వరగా పెడితే బాగుండేదని మరో యువకుడు చెప్పగా.. వినోద్‌కుమార్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. వినోద్ కుమార్ వెంట టీఆర్ఎస్ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి ఉన్నారు.