వ్యాపారాలు సజావుగా సాగాలంటే గ్రామాలు సస్యశ్యామలంగా ఉండాలని.. అలాంటి గ్రామాలు కావాలంటే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ పట్టణంలోని వ్యాపార వర్గాలతో వినోద్‌కుమార్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు. అందుకే యావత్ ప్రపంచంలోని వ్యాపార, పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపే చూస్తున్నాయని తెలిపారు. వ్యాపారాలు సాఫీగా, సవ్యంగా సాగాలంటే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని, అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.
విద్యుత్, నీటిపారుదల రంగంలో రాష్ట్రం ఎంతో ప్రగతిని సాధించిందని బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగాలలో మరిన్ని అద్భుతాలు చేసి చూపిస్తామని తెలిపారు. ఇందుకోసం మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని వ్యాపారవర్గాలను ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వినోద్ కుమార్ వ్యాపారులకు వివరించారు. వ్యాపారవర్గాలతో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవిరాజు, పార్టీ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు తదితరులు పాల్గొన్నారు.