పటాన్చెరు, జూలై 27: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని విరూపాక్ష పరిశ్రమలో శనివారం బాయిలర్ పేలడంతో ఇద్దరు మేనేజర్లు తీవ్రంగా, మరో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. బీడీఎల్ భానూర్ సీఐ స్వామిగౌడ్, స్థానికుల కథనం ప్రకారం.. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో ఫార్మా ఉత్పత్తుల కంపెనీ విరూపాక్షలో మధ్యాహ్నం బాయిలర్ వద్ద చార్కోల్ యాష్ మరమ్మతుల కోసం సిబ్బంది వెళ్లారు. అప్పుడే అకస్మాత్తుగా బాయిలర్ పేలడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న మేనేజర్లు అనంత్‌రెడ్డి, శ్రీకాంత్, సిబ్బంది హరిప్రసాద్, దీపక్ గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మేనేజర్ల అనంత్‌రెడ్డి, శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వీరిని హుటాహుటిన పటాన్‌చెరులోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. పేలుడుతో ఆ బ్లాక్ రేకులు ఎగిరిపోయాయి. పాశమైలారం, పటాన్చెరు నుంచి అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను ఆర్పాయి. ప్రమాదంలో నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయని, వారికి యాజమాన్యం మెరుగైన చికిత్సను అందిస్తున్నదని పరిశ్రమ జీఎం రాజమౌళి తెలిపారు.
టీటీడీ అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు ఈవోగా సీహెచ్ వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ అవకాశం కల్పించిన చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు.