Boianapalli Vinod Kumar : ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ విజయవంతం కావాలంటే బూత్ లెవల్ అధికారు లు (BLOలు) మరింత సమర్ధంగా పనిచేయాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో నియమించిన బూత్ లెవల్ అధికారులకు సర్ ప్రక్రియపై పూర్తి అవగాహన లేదని, అవసరమైన ఫారాలు కూడా అందుబాటులో లేవనే విషయాన్ని ఆయన సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బీఆర్ఎస్ బృందం కీలక సూచలను చేసింది. ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో సాయంత్రం 4:.30 గంటలకు భేటీ సందర్భంగా ఎంపీ లు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారధి రెడ్డి, మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ సర్‌పై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సర్ విషయంలో హైదరాబాద్‌లోనూ సమస్యలు గుర్తించిన తర్వాత కొంతమంది అధికారులను మార్చిన విషయాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు వినోద్ కుమార్ చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 వేల మంది బూత్ లెవల్ అసిస్టెంట్లను నియమించా
మని, వారు ప్రతి బూత్‌లో ఓటర్లకు సహాయపడుతూ సవరణ ప్రక్రియలో భాగస్వాములవుతున్నారని మాజీ ఎంపీ తెలిపారు. ఓటరు జాబితాల ప్రక్షాళన నిరంతర ప్రక్రియ అని పేర్కొన్న వినోద్.. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తే ఈ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సాగుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఓటరు వివరాలను ఆధార్‌తో అనుసంధానం (Aadhaar Linking) చేస్తే డూప్లికేట్ నమోదులను గుర్తించడం సులభమవుతుందని ఎన్నికల సంఘానికి ఆయన సూచించారు.

అయితే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆధార్‌ను తప్పనిసరి (Mandatory) చేయడం సాధ్యం కాదని తాము గుర్తిస్తున్నామని.. అయినప్పటికీ తమ అనుభవం ప్రకారం దాదాపు 99 శాతం మంది ఓటర్లు స్వచ్ఛందంగా ఆధార్ వివరాలను అందిస్తున్నారని ఆయన తెలిపారు. అలాంటి సందర్భాల్లో ఆధార్ ఆధారిత ధ్రువీకరణ ఓటరు జాబితాల పరిశుభ్రతకు, పారదర్శకతకు ఎంతో ఉపయోగ పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించినట్లు బి. వినోద్ కుమార్ వెల్లడించారు.