బన్సీలాల్‌పేట్, సెప్టెంబర్ 29: ప్రముఖ రచయిత్రి బోయి విజయభారతి (85) భౌతికకాయాన్ని ఆదివారం సికింద్రాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాల అనాటమీ విభాగానికి అప్పగించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె అమీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో శనివారం కన్నుమూశారు. విజయభారతి మృతికి మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సాహిత్య, సామాజిక అధ్యయనశీలిగా ఆమె చేసిన కృషిని స్మరించుకున్నారు. విజయభారతి 1941లో తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ప్రముఖ రచయిత, పద్మభూషణ్ దివంగత బోయి భీమన్న, నాగరత్నమ్మకు జన్మించారు. 1968లో మానవహక్కుల నేత, న్యాయవాది దివంగత బొజ్జా తారకంను వివాహం చేసుకున్నారు. ఆమె కుమారుడు రాహుల్ బొజ్జా ప్రస్తుతం తెలంగాణ ఐఏఎస్ కేడర్‌లో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. విజయభారతి కోఠి ఉమెన్స్ కాలేజీలో పీజీ చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా పనిచేశారు.
పలువురి నివాళి..
ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మహబూబ్‌నగర్ కలెక్టర్ బోయి విజయేంద్ర, సీనియర్ ఐఏఎస్‌లు దాన కిశోర్, కొప్పుల రాజు, ఆఫీసర్స్ ఫోరం కన్వీనర్ సిద్దోజీరావు, దళిత స్త్రీశక్తి కన్వీనర్ గెడ్డం ఝాన్సీ, పీవోడబ్ల్యూ సంధ్య, ప్రొఫెసర్ సుధారాణి, సీనియర్ జర్నలిస్ట్ బండారు రాజు, డాక్టర్ దయా అరుణ, టీపీసీసీ కార్యదర్శి దుర్గం భాస్కర్, డాక్టర్ కోయి కోటేశ్వర్రావు, ఏఐఎస్ఎఫ్ నేత స్టాలిన్, డాక్టర్ భూపెల్లి నారాయణతోపాటు అభ్యుదయవాదులు, దళిత సంఘాల నాయకులు, విజయభారతి పార్థివదేహానికి కుందన్‌బాగ్‌లోని రాహుల్ బొజ్జా నివాసంలో నివాళులర్పించారు.