హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గిగ్‌వర్కర్ల కోసం త్వరలో బోర్డును ఏర్పాటు చేసి.. ఉత్తమ పాలసీని రూపొందిస్తామని కార్మిక, ఉపాధికల్పనశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో గిగ్‌వర్కర్ల సమస్యలపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 4.5 లక్షలమంది గిగ్ వర్కర్లు ఉన్నారని, వారు అనేక సమస్య లు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వారి సంక్షేమం కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో ప్రత్యేక పాలసీని తీసుకొస్తున్నట్టు చెప్పారు. రాజస్థాన్‌లో మాదిరిగా తెలంగాణలో కూడా గిగ్‌వర్కర్ల కోసం ఒక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గిగ్‌వర్కర్ల పాలసీపై యాజమాన్యాలు, గిగ్‌వర్కర్ల నుంచి 66 సూచనలు వచ్చాయని.. వాటిపై మంత్రి మండలిలో చర్చించి అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు. గిగ్‌వర్కర్ల చట్టంతో వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని, కనీస వేతనం వచ్చేలా కృషి చేస్తామని వివేక్ హామీ ఇచ్చారు.