హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ గురుకులాల్లోని టీచర్లు, లైబ్రేరియన్లు, పీడీ పోస్టుల భర్తీ ప్రక్రియపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫలితాల ప్రకటనపై అభ్యర్థులు పలు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. రిక్రూట్మెంట్లో భాగం గా గురుకుల బోర్డు గోప్యతను పాటించడం అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తుతున్నది. క్యాటగిరీల వారీగా కటాఫ్‌లను వెల్లడించకపోవడం..ఆగమేఘాల మీద ప్రక్రియ చేపట్టడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కొంతమందికి అన్యాయం తలపెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గురుకుల పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 9 నుంచి 11 వరకు ఆదరా బాదరగా సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. ఒక్కరోజు వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించారు. ఏ క్యాటగిరీలో ఎంత కటాఫ్.. ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారన్న వివరాలను గురుకుల రిక్రూట్‌మెంట్‌బోర్డు వెల్లడించలేదు. కేవలం మెరిట్లిస్టులను మాత్రమే ప్రకటించారు. ఇటీవలే గ్రూప్ -4 ఫలితాలను వెల్లడించిన టీఎస్పీఎస్సీ మెరిట్‌తోపాటు, రోస్టర్, పరీక్షలో సాధించిన మా ర్కుల వివరాలను బహిర్గతం చేసింది. ఇదే తరహాలో గురుకుల బోర్డు ప్రకటించకపోవడంతో గందరగోళం నెలకొన్నది. వికలాంగుల కోటాపైనా అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రజాభవన్‌లో బైఠాయించిన జేఏసీ
తమ డిమాండ్లను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పోస్టులను భర్తీ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వ గురుకుల ఉద్యోగుల, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు మంగళవారం ప్రజాభవన్‌లో ధర్నా నిర్వహించారు. గురుకుల ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టిన తర్వాతే పోస్టులను భర్తీ చేయాలని జేఏసీ నేతలు మామిడి నారాయణ, గురుకుల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రభుదాస్, తెలంగాణ గిరిజన గురుకుల టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ రుషికేశ్ కుమార్ డిమాండ్ చేశారు. పీఆర్టీయూ అనుబంధ గురుకుల ఉపాధ్యాయ సంఘం పీఆర్జీటీయూ నేతలు కూడా బదిలీలు, పదోన్నతులు కల్పించిన తర్వాతే కొత్త నియామకాలు చేపట్టాలని ఇటీవలే ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
అభ్యర్థుల అనుమానాలు
నేడు పోలీస్ అభ్యర్థులకు నియామక పత్రాలు
పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన వారికి బుధవారం ప్రభుత్వం నియామక పత్రాలను అందజేయనున్నది. హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సహా ఇతర మంత్రులు.. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియమితులైన 15 వేలకు పైగా కానిస్టేబుళ్లకు నియామకపత్రాలు అందజేస్తారు.