హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమన్యాయం చేసేందుకే జిల్లాలవారీగా 5 వేల పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు హైకోర్టుకు తెలిపింది. జనాభా దామాషా ప్రకారం ఆ పోస్టులను కేటాయించి కాంటిజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్లవారీగా నియామకాలు చేపడుతున్నట్టు వివరించింది. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ)కు చెందిన దాదాపు 5 వేల కానిస్టేబుల్ పోస్టులను రాష్ట్రస్థాయి పోస్టులుగా లేదా కాంటిజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ (సీడీసీ) పోస్టులుగా గుర్తించి నియామకాలు చేపట్టాలంటూ దాఖలైన వ్యాజ్యంపై బోర్డు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రస్థాయి పోస్టులైన స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను గత నోటిఫికేషన్లకు భిన్నంగా జిల్లాస్థాయి పోస్టులుగా నియమించేందుకు జారీచేసిన జీవో 46ను కొట్టేయాలని కోరుతూ 20 పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేవరకు స్పెషల్ పోలీస్ పోస్టుల ఫలితాలను వెలువరించబోమని బోర్డు గతంలోనే హైకోర్టుకు హామీ ఇచ్చింది. అభివృద్ధి చెందిన, పట్టణ ప్రాంత జిల్లాలకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమన్యాయం చేసేందుకుకే జీవో 46 జారీ చేసినట్టు తాజాగా బోర్డు స్పష్టం చేసింది. ఈ జీవో రాష్ట్రపతి కొత్తగా జారీ చేసిన ఉత్తర్వులు-2018కు లోబడే ఉన్నదని, గత నియామక నోటిఫికేషన్లు పాత రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇచ్చినవని పేర్కొన్నది. పిటిషనర్లు కోరినట్టుగా రాష్ట్రస్థాయి లేదా కాంటిజియస్ డిస్ట్రిక్ట్ స్థాయిలో నియామకాలు చేపడితే అభివృద్ధి చెందిన జిల్లాలవారే ఎక్కువగా ఎంపికయ్యే అవకాశం ఉంటుందని, దీంతో వెనుకబడిన జిల్లాల అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని వివరించింది.