Home Guard |వేములవాడ, డిసెంబర్ 25: సాన్నిహిత్యంగా మెలుగుతూ, బ్లాక్ మెయిల్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్థికంగా ఉన్న పలువురి నుంచి ఓ కిలేడీ కోటి దాకా లూటీ చేసిన ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీస్ శాఖలో హోంగార్డుగా పనిచేస్తూ వ్యవహరించిన తీరు ఆ శాఖకే కళంకం తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే.. సదరు మహిళ వేములవాడ లో హోంగార్డుగా పనిచేస్తుండగా రాజన్న ఆలయ ఏఈగా పనిచేసి రిటైర్డ్ అయిన శేఖర్‌తో పరిచయం పెంచుకున్నది. తన భర్త ఆరోగ్యం బాగాలేదని అతని నుంచి 5లక్షలు వసూలు చేసింది. డబ్బులు తిరిగి అడగ్గానే శేఖర్ ఫొటో లు మార్పిడి చేసి బ్లాక్ మెయిల్ చేయగా, వేములవాడ ఠాణాలో 5న కేసు నమోదైంది. వేములవాడరూరల్ మండలం అనుపురానికి చెందిన పరశురామ్‌తో పరిచయం పెంచుకొని 45 లక్షలు కాజేసింది. పరశురాం అక్టోబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో ఇద్దరు న్యాయవాదులు కలిసి ఉన్న ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ 15 లక్షలు డిమాండ్ చేసింది. వేములవాడ ఠాణా, హైదరాబాద్‌లో 3న కేసు నమోదైంది. మరో ఘటనలో వేములవాడలోని సుభాష్‌నగర్‌లో సుజాతతో ఆమె మహిళా కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్నది. ఖరీదైన కార్లలో ఆమె దగ్గరికి వస్తూ, అప్పుడప్పుడూ షాపులో ఉద్దెర పెడుతూ రూ.9లక్షల అప్పు తీసుకున్నది. డబ్బులు అడిగితే రేపు మాపు అంటూ ముఖం చాటేయడంతో బాధితురాలు ఈ నెల 11న వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మూడు జిల్లాల్లో ఫిర్యాదులు..
రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో ఆమెపై 8 కేసులు నమోదైనట్టు పోలీస్ శాఖ ద్వారా తెలిసింది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లోనే నాలుగు కేసులు ఉండగా, జగిత్యాలలో రెండు, కరీంనగర్లో రెండు ఫిర్యాదులు పోలీసులకు అందినట్టు సమాచారం. అవసరమైతే వల, లేదంటే బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చిన కిలేడీ దోపిడీ వ్యవహారం ఇటీవలే బయటికి రాగా, బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తుండడం ఉమ్మడి జిల్లాలో కలకలం రేపుతున్నది.