హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు నామినేషన్ను తిరస్కరించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేవైఎం జాతీయ కోశాధికారి పీఎం సాయిప్రసాద్ ఫిర్యాదు చేశారు. మైనంపల్లి 2014 ఎన్నికల్లో అమెరికాలోని అలబామ యూనివర్సిటీలో బీబీఏ చదివినట్టు పేర్కొన్నారని, 2018 ఎన్నికల అఫిడవిట్లో ఇంటర్ చేసినట్టు ఆయన పేర్కొన్నారని, ప్రస్తుతం విద్యార్హతలను ఎక్కడా పేర్కొనలేదని ఫిర్యాదులో తెలిపారు.
దీనితో పాటుగా అల్వాల్ పోలీస్స్టేషన్లో 17 ఏప్రిల్ 2023న నమోదైన కేసు గురించి, తన ఇల్లు వివరాలు అఫిడవిట్లో పేర్కొనలేదని వివరించారు. మైనంపల్లి భార్య వాణి ‘అరవింద్ రికార్డు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ శివశక్తి రియల్ టైర్స్’ సంస్థల్లో డైరెక్టర్గా ఉం దని రాసి, ఈ వివరాలు అఫిడవిట్లో పొందుపర్చలేదని చెప్పారు. మైనంపల్లి తన అఫిడవిట్ పత్రం వెరిఫికేషన్ తేదీ లేదని తెలిపారు. ప్రజాప్రతినిధ్య చట్టం సెక్షన్ 125 ప్రకారం మైనంపల్లి నామినేషన్ను తిరస్కరించాలని కోరారు.