మంచిర్యాల టౌన్ : కేంద్రంలోని బీజేపీ( BJP ) ప్రభుత్వం ఆపరేషన్ కగార్ (Operation Kagar ) పేరిట దుశ్చర్యలకు పాల్పడుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kalvakuntla Kavitha ) ఆరోపించారు. శుక్రవారం మంచిర్యాలలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు.
మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు ( Nambala Kesavrao ) ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీసం మానవత్వాన్ని చూపించకుండా, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా బీజేపీ సంస్కారాన్ని కోల్పోయిందని విమర్శించారు. కగార్‌ను ఆపాలని పదేపదే కోరినా స్పందించకుండా మారణకాండను కొనసాగించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు .
ఇటీవల నిర్వహించిన సరస్వతి పుష్కరాల్లో స్థానిక ఎంపీ గడ్డం వంశీని ఆహ్వానించకపోవడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. గతంలో యాదగిరిగుట్టలో కూడా రేవంత్ రెడ్డి కుటుంబాన్ని ఆసనాలలో కూర్చుండబెట్టి , డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కింది ఆసనాలలో కూర్చోబెట్టి అవమానించారని దుయ్యబట్టారు. అనంతరం ఇటీవల మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు మునీర్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు .