తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం ఢిల్లీ వీధుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. బీజేపీ దళారుల ఆడియో టేపుల్లో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీజేపీ స్వాముల మాటలపై ఆప్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఆపరేషన్ లోటస్‌లో ప్రధాన సూత్రధారి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాయే అని.. ఈ దేశంలో బీజేపీ రాజకీయ నేతల కిడ్నాపింగ్గా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమిత్‌షాను వెంటనే బర్తరఫ్ చేసి అరెస్టు చేసి విచారించాలని డిమాండ్‌చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ రాజకీయ పార్టీగా కాకుండా ఎమ్మెల్యేల కిడ్నాపింగ్ గ్యాంగ్‌లా మారిందని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా 9 రాష్ర్టాల్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, కిడ్నాప్ చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ తరహాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నప్పుడు ఎన్నికలు ఎందుకని, దేశంలో ఎన్నికలనేవి తీసేయండి అని తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ఈ కిడ్నాపింగ్ గ్యాంగ్‌ను నడుపుతున్నారంటే అంతకు మించిన ప్రమాదకరమైనది మరోటి ఉండబోదన్నారు. అమిత్ షాను వెంటనే అరెస్టు చేసి ప్రశ్నించాలని డిమాండ్‌చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న బీజేపీ రాజకీయ పార్టీ గుర్తింపును సైతం కేంద్ర ఎన్నికల కమిషన్ రద్దు చేయాలన్నారు.
రాజకీయ పార్టీగా చెప్పుకొనే హక్కు బీజేపీకి లేదని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న ‘ఆపరేషన్ లోటస్’పై ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసే ‘ఆపరేషన్ లోటస్’ ఢిల్లీలోనూ జరుగుతున్నదని సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టంచేశారన్నారు. దానికి స్పష్టమైన నిదర్శనం తెలంగాణలో లభించిందని చెప్పారు. బీజేపీ నాయకులు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను రూ.25 కోట్లు, రూ.50 కోట్లు.. రూ.100 కోట్లు పెట్టి కొంటున్నారు అనడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలే నిదర్శనమని నొక్కి చెప్పారు. తెలంగాణలో బీజేపీకి కేవలం ముగ్గురే ఎమ్మెల్యేలు ఉన్నా 104 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ సర్కార్‌ను కూలదోయాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలన్న ఆ పార్టీ ప్రయత్నం తేటతెల్లం అవుతున్నదన్నారు.
ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు కూడా డబ్బులు సిద్ధం చేసుకొన్నట్టు బీజేపీ దళారులు చెప్తున్న ఆడియోలను సంజయ్‌సింగ్ మీడియాకు వినిపించారు. ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి.. కొనుగోలు చేసి.. ఇలా 9 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూలదోసిందని ఆగ్రహించారు. ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో ప్రభుత్వాలను పడగొట్టిందని గుర్తుచేశారు. మేఘాలయలో పొత్తులు పోగొట్టి అధికారంలోకి వచ్చిందని, గోవాలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ఎమ్మెల్యేలను పార్టీల నుంచి విడగొట్టడం.. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం ఇదే బీజేపీ విధానమని చెప్పారు. ‘ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోస్తున్నప్పుడు దేశంలో ఎన్నికలు ఎందుకు?. అవినీతి మార్గాల్లో దేశవ్యాప్తంగా బీజేపీ సంపాదిస్తున్న వందల కోట్ల రూపాయలను ఎమ్మెల్యేల కొనుగోలుకు వాడుతున్నది. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల్లో బీజేపీ దళారి రామచంద్ర భారతి స్పష్టంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరు చెప్పారు. బీజేపీలో ప్రముఖ వ్యక్తి బీఎల్ సంతోష్ పేరు ప్రస్తావించారు’ అని సంజయ్‌సింగ్ చెప్పారు.
కేంద్ర హోంమంత్రే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసి.. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారంటే అంతకు మించిన ప్రమాదం మరోటి ఉండదని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ ఆరోపించారు. ‘కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే అరెస్టు చేసి, ప్రశ్నించాలి. ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ సిద్ధం చేసిన రూ.1,075 కోట్లు అమిత్ షా ఎక్కడ దాచారో విచారణ జరగాలి. సీబీఐ, ఈడీ ఇతర జాతీయ దర్యాప్తు సంస్థలన్నీ తమ జేబులోనే ఉన్నాయని బీజేపీ దళారులు చెప్తున్నారంటే దేశంలో ఏం పరిస్థితి ఉన్నదో అర్థం చేసుకోవాలి. తెలంగాణలో పట్టుబడిన ముగ్గురు దళారులు చెప్పిన ప్రకారం.. ఢిల్లీలోనూ ఆపరేషన్ కమల్‌కు ప్రయత్నించారన్నది తేటతెల్లం అయ్యింది. పంజాబ్‌లోనూ ఆపరేషన్ లోటస్‌ను ఆప్ ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో పంజాబ్, ఢిల్లీలో ఆపరేషన్ విఫలమైంది’ అని వివరించారు. బీజేపీ ఎక్కడైతే గెలవలేదో.. అక్కడ వాళ్ల కిడ్నాపింగ్ గ్యాంగ్‌ను దింపుతుందని ఆరోపించారు. అలాంటప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాలు ఎలా బతుకుతాయని ప్రశ్నించారు. దేశ భద్రత బాధ్యత ఉన్న కీలక వ్యక్తి కేంద్ర హోం మంత్రే స్వయంగా ఈ వ్యవహారంలో ఉంటే ప్రజాస్వామ్యం ఎలా బతుకుందని నిలదీశారు. అమిత్‌షాను అరెస్టు చేసి ఆపరేషన్ లోటస్‌లో ఆయన పాత్రపై ప్రశ్నించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని సంజయ్‌సింగ్ డిమాండ్‌చేశారు.