హైదరాబాద్, నవంబర్ 10(నమస్తే తెలంగాణ): కమల్ఫైల్స్ (ఎమ్మెల్యేల ఎర) కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో బీజేపీ రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. మొయినాబాద్ పోలీసుల దర్యాప్తును అడ్డుకోవాలని బీజేపీ నేత జీ ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించటంతో తాజాగా గురువారం రిట్ అప్పీల్ పిటిషన్ వేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయడాన్ని కూడా ఈ పిటిషన్లో ప్రశ్నించారు. ఈ కుట్రతో తమకు సంబంధం లేదంటూనే బీజేపీ నేతలు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తుండటం గమనార్హం. అప్పీల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించి సిట్ దర్యాప్తును నిలిపివేసి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టును కోరారు. ఈ పిటిషన్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, రాజేందర్‌నగర్ ఏసీపీ,మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీవీ ఆనంద్‌ను ప్రతివాదులుగా చేర్చారు.