హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): మునుగోడులో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని, ఓటమికి కారణాలు వెతుక్కోవడంలో భాగంగా ఓటరు నమోదుపై డ్రామాలకు తెరతీసిందని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మునుగోడులో దొంగ ఓట్లు నమోదు చేయించిందే బీజేపీ అని ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్ గుప్తా, పార్టీ నేత దేవీప్రసాద్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేసినట్టుగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కూడా తన చెప్పుచేతుల్లో పెట్టుకున్నదని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే తన అనుబంధ సంస్థలైన ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలతో పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేయించిందని ఆరోపించారు. కోర్టులకు వెళ్లింది కూడా బీజేపీ వాళ్లేనని, దొంగే దొంగ అన్నట్టు బీజేపీ నేతల వైఖరి ఉన్నదని దుయ్యబట్టారు. బ్రహ్మాండమైన మెజార్టీతో టీఆర్ఎస్ గెలవబోతున్నదని చెప్పారు.
రాజగోపాల్‌రెడ్డిని రాజకీయంగా బొందపెట్టడం ఖాయం
ఉపఎన్నికలో రాజగోపాల్‌రెడ్డిని రాజకీయంగా బొంద పెట్టడం ఖాయమని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రాజగోపాల్ ఓటమి ద్వారా నల్లగొండ జిల్లాకు పట్టిన శని పోతుందని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, బీజేపీలో చేరిక, ఉప ఎన్నిక.. అన్నీ అమిత్‌షా డైరెక్షన్లోనే జరిగాయని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో వారికి తెలుసునని, అందుకే పెద్దఎత్తున దొంగ ఓట్లను నమోదు చేయంచారని బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ ఒత్తిడికి తలొగ్గకుండా అనర్హుల ఓట్లను తిరస్కరించిన ఎన్నికల అధికారులను అభినందించారు. టీఆర్ఎస్ను ఓడించేందుకు కారును పోలిన గుర్తులు, ప్రభాకర్‌రెడ్డి పేర్లతో నామినేషన్లు వేయించారని, ఎన్ని చేసినా టీఆర్ఎస్ను గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు.