వరంగల్ : సీఎం కేసీఆర్ (CM KCR) రైతుల కోసం మేలు చేసే కార్యక్రమాలు చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు కీడు చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు మండల కేంద్రంలో డీసీసీబీ(DCCB) అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్సీఎస్ (FSCS) మార్ట్, వెయ్యి మెట్రిక్ టన్నుల గోదాంలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ రైతులకు కాళేశ్వరం సాగు నీరు, 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్(CM KCR) దయ వల్ల రాష్ట్రం సస్యశ్యామలమయ్యిందని,భూగర్భ జలాలు పెరిగాయని పేర్కొన్నారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. దేశ వ్యాప్త రైతుల కోసం ఉద్యమించిన 7వేల మంది రైతులను బీజేపీ(BJP) ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) హైదరాబాద్ వేదికగా రూ. 200 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. కాని రూ. 1250 కి పెంచారని మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచిన ప్రజా వ్యతిరేక ప్రభుత్వం బీజేపీదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్సీఎస్ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, టెప్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్ నాగ భూషణం, జిల్లా రైతు బంధు అధ్యక్షురాలు లలితా యాదవ్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, బ్యాంక్ అధికారులు, నందనం సొసైటీ డైరెక్టర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.