ఓటమి భయంతోనే ఇండియా కూటమిని బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఇండియా కూటమిలో ఇన్నాళ్లు కీలక పాత్ర పోషించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కక్కిన కూడు తినేందుకే తిరిగి ఎన్డీయే కూటమిలోకి వెళ్లారని దుయ్యబట్టారు. హైదరాబాద్లోని ముఖ్దూం భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. ఫిబ్రవరి 2, 3, 4వ తేదీల్లో సీపీఐ జాతీయ సమితి సమావేశాలను హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
పదేండ్లు అధికారంలో ఉండి ప్రధాని మోదీ దేశానికి చేసింది ఏమీ లేదని.. అందుకే శ్రీరాముడి పేరు చెప్పుకుని గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని నారాయణ విమర్శించారు. లోక్సభ ఎన్నికల ముందు అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించి జనాలు తమవైపు తిప్పుకోవాలని బీజేపీ ప్లాన్ చేసుకుందని.. అందుకే ఆలయ నిర్మాణం పూర్తికాకపోయినా ప్రారంభించారని అన్నారు. బీజేపీ పదేండ్ల కాలంలో కొత్తగా ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను గాని, నీటి పారుదల ప్రాజెక్టులను గాని తీసుకురాలేదని.. పైగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేటుపరం చేశారని విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మోదీ ప్రతిజ్ఞ చేసినట్టుగా కనిపిస్తుందని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో అదానీ పెట్టుబడులపైనా నారాయణ స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడేలా, అభివృద్ధి చేసే క్రమంలో వ్యాపారం చేస్తే తమకు అభ్యంతరం లేదని.. రాష్ట్రాన్ని అమ్మే పద్ధటి పట్లనే తమకు అభ్యంతరమని స్పష్టం చేశారు.