BJP | మెట్పల్లి, సెప్టెంబర్ 28: జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన బీజేపీ పట్టణాధ్యక్షుడు బొడ్ల రమేశ్ మరో నలుగురు అనుచరులతో కలిసి గురువారం రాత్రి తన పక్కింటి వారిపై దాడికి దిగారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతున్నది. మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడలో బొడ్ల రమేశ్, గుండెగాని విద్యాసాగర్‌గౌడ్ ఇండ్లు పక్కపక్కనే ఉన్నాయి. ఇంటి స్థలం విషయంలో వీరి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్నది. ఇది మనసులో పెట్టుకున్న రమేశ్ రాత్రి వినాయక నిమజ్జనోత్సవం ముగిసిన తర్వాత నలుగురు అనుచరులతో కలిసి విద్యాసాగర్గౌడ్తో గొడవకు దిగారు.
ఇంటిపై దాడి చేయడంతో ప్రహరీ, గేటు, ద్విచక్రవాహనం, ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి. గేటు విద్యాసాగర్‌గౌడ్ తల్లి అమృతపై పడటంతో ఆమె ఎడమ కాలు విరిగిపోయింది. కుటుంబసభ్యులు ఆమెను దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. విద్యాసాగర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు రమేశ్‌తోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై శ్యామ్‌రాజ్ తెలిపారు.
కవితక్కతోనే మహిళలకు రక్షణ
కాగా.. ఈ ఘటనపై బాధిత మహిళ గుండెగాని సౌందర్య.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఉద్దేశించి దవాఖాన నుంచి మాట్లాడిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆడియో సారాంశం ప్రకారం.. ‘మాది మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడ. గురువారం రాత్రి బీజేపీ పట్టణాధ్యక్షుడు బొడ్ల రమేశ్ కొంత మంది గూండాలతో వచ్చి నా మీద, నా భర్త, నా అత్తపై దాడి చేశారు. ఈ దాడిలో మా అత్త కాలు విరిగింది. దవాఖానకు తీసుకొచ్చాం.
ఇలాంటి దాడులతో బీజేపీ తరఫున ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? తాగుబోతులు, రౌడీల చేతిలో మీ పార్టీని పెడితే అసలు పార్టీ ఉంటుందా? మా ఇంటి గేటును కూలగొట్టి చేతకాని ముసలమ్మ అని చూడకుండా మా అత్త కాలుపై వేశారు. అలాంటి వారిని మీరెలా వదిలేస్తున్నారు సార్? రానున్న ఎన్నికల్లో మళ్లీ మేం కవితక్కనే ఎంపీగా గెలిపించుకుంటాం. ఆమె అయితేనే మహిళలకు రక్షణగా ఉంటుంది. ఈ మెసేజ్ పంపినందుకు వాళ్లు మళ్లీ మా మీద దాడి చేయవచ్చు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ మాట్లాడింది.