Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు. బ్యారేజీల పునరుద్ధరణను గాలికి వదిలేశారని మండిపడ్డారు. NDSA సిఫారసులను సకాలంలో అమలు చేయకపోవడం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. NDSA నివేదిక అడ్డుపెట్టుకుని ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. మేడిగడ్డలో నీటిని నిల్వచేయకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోవచ్చని తెలిపారు. రాజకీయాలు పక్కనబెట్టి ప్రజల కోసం కాళేశ్వరం నీటిని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్‌రావు లేఖ రాశారు.
ఎన్డీఎస్ఏ సిఫారసులను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రామచందర్‌రావు విమర్శించారు. దీనివల్ల రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా ఎన్డీఎస్ఏ సిఫారసులను అమలు చేయలేదని విమర్శించారు. బ్యారేజీ పునరుద్ధరణ పునులను రెండేళ్లలోనే పూర్తి చేయవచ్చని నిపుణులు సూచించినప్పటికీ.. ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. దీని ఫలితంగా మూడు బ్యారేజీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదని పేర్కొన్నారు. గోదావరి జలాల్లో సుమారు 200 టీఎంసీల నీటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
కాళేశ్వరం పునరుద్ధరణ బాధ్యతను ఎన్డీఎస్ఏ కమిటీపై నెట్టేయడాన్ని సైతం రామచందర్‌రావు లేఖలో తప్పుబట్టారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మార్గదర్శకాలు మాత్రమే చేస్తుందని.. పునరుద్ధరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ కమిటీపై బాధ్యతను నెట్టేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందని మండిపడ్డారు.
మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నిల్వ చేయకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని రామచందర్‌రావు తెలిపారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ వేగంగా పూర్తి చేసి ఉంటే.. ఉత్తర తెలంగాణలో 20 నుంచి 25 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు 10 టీఎంసీల తాగునీరు అందించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. విజిలెన్స్ కమిషన్, జస్టిస్ పీసీ ఘోష్ నివేదికలను ఎందుకు బహిర్గతం చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని రామచందర్ రావు ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించి రాష్ట్ర ప్రజలకు గోదావరి జలాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
Enough of the drama by BRS and Congress on Kaleshwaram.
It is time for facts. People of Telangana deserve to know the truth.
Today, I wrote an Open Letter to Chief Minister @revanth_anumula garu, highlighting the Congress Government’s failure to rehabilitate the three damaged… pic.twitter.com/BmE6aq2PjW
— N Ramchander Rao (@N_RamchanderRao) July 12, 2026