Congress-BJP | నల్లగొండ ప్రతినిధి/ఇబ్రహీంపట్నం, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఏ పార్టీకి ఎవరు బీటీమ్ అనే విషయం సోమవారం తేటతెల్లమైంది. కాంగ్రెస్‌కు బీజేపీ బీటీమ్ అన్న విషయం నల్లగొండ వేదికగా తేలిపోయింది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్కటై మున్సిపల్ సమావేశానికి వచ్చారు. నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి (బీఆర్ఎస్)కి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు.
అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మొత్తం 41 మంది సభ్యులు చేతులు ఎత్తగా, ఐదుగురు బీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకంగా, ఒకరు తటస్థంగా వ్యవహరించారు. మ్యాజిక్ ఫిగర్‌కు మించి ఓట్లు రావడంతో సైదిరెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కాంగ్రెస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి ఐదుగురు బీజేపీ సభ్యులు కూడా మద్దతు పలికారు.
బీజేపీకి మొత్తం ఆరుగురు సభ్యులు ఉండగా ఫ్లోర్‌లీడర్ బండారు ప్రసాద్ మీటింగ్‌కు హాజరు కాలేదు. మిగతా ఐదుగురు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచి అవిశ్వాసాన్ని నెగ్గించుకున్నారు. మరోవైపు, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతిపై సోమవారం బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు పలువురు అవిశ్వాసం పెట్టాలంటూ 17మంది కౌన్సిలర్లు జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు వినతిపత్రం అందజేశారు.