హైదరాబాద్, నవంబర్ 20(నమస్తే తెలంగాణ): మహిళలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ ఆడబిడ్డల పేరిట సభలు నిర్వహించే అర్హత లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డి పేర్కొన్నారు. వరంగల్‌లో సభ పెట్టి భద్రకాళి అమ్మవారు, సమ్మక్క సారలమ్మ సాక్షిగా మహిళలను అవమానించారని ఆరోపించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హోంమంత్రి లేని రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. హామీలను మరిచిన సీఎం రేవంత్‌రెడ్డి విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు, పెండ్లి చేసుకునేవారికి తులం బంగారం ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు.