హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయ మీద సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న ప్రేమను స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు. తనకు కాంగ్రెస్‌లో పొన్నం ప్రభాకర్, మహేశ్‌కుమార్ గౌడ్‌పై ప్రేమ ఉన్నదని, కాబట్టి కాంగ్రెస్ వెంటనే రేవంత్‌రెడ్డిని తొలగించి వారిద్దరిలో ఒకరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలన్న సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌పై స్పందిస్తూ.. బీసీని సీఎం చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ బీసీ కాదని రేవంత్ రెడ్డి బీసీ సమాజాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కన్వర్టెడ్ బీసీ అనే కొత్త పదాన్ని సృష్టించారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ విషయంలో ఇదే మేము ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారని నిలదీశారు.
‘అత్తారింటికి దారేది’ సినిమాలో బ్రహ్మనందంకు భాస్కర్ అవార్డు ఉంటుందని, ఇదే తరహాలో సీఎం రేవంత్‌రెడ్డికి భాస్కర్ అవార్డుతోపాటు గోబెల్స్ అవార్డు కూడా ఇవ్వాలని ఎద్దేవాచేశారు. ఈ మేరకు సోనియా గాంధీకి సిఫార్సు చేస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కమిటీ కసరత్తు వారం రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. కమిటీలో 20 పోస్టులే ఉన్నాయని, అందులో 8 ఉపాధ్యక్షులు, 3 ప్రధాన కార్యదర్శులు, 7కార్యదర్శులు, ఒక కోశాధికారి అని వివరించారు. ఇందులో 5మహిళలకు, మూడు ఎస్సీ, ఎస్టీలకు దక్కుతాయని వివరించారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని, అందుకే జంబో కమిటీ ఉందని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటామని, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడున్నరేండ్ల సమయం ఉన్నదని, అయినా ప్రజల్లోకి వెళ్లాలని అమిత్‌షా చెప్పినట్టు వెల్లడించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనపై చేసిన వ్యాఖ్యలపై కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టంచేశారు. రాజాసింగ్ అంశం తన పరిధిలో లేదని, బండి సంజయ్, ఈటల రాజేందర్ వివాదం సమిసిపోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు. హైడ్రా ఫెయిల్యూర్ వ్యవస్థ అని అభిప్రాయపడ్డారు.