హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌పై నానా యాగీ చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది. లీకువీరుడి కోసం ఒక రోజంతా రచ్చ చేస్తూ హైడ్రామా నడిపింది. పోలీసులతో వాగ్వాదాలకు దిగుతూ, కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, తీవ్ర ఉద్రిక్తత వాతావరణం సృష్టించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. జాతీయ రహదారులపై టైర్లకు నిప్పు పెట్టి, భయోత్పాతం సృష్టించింది.
వరుస పేపర్ లీకేజీల వెనుక బండి సంజయ్ పాత్ర ఉన్నదన్న విషయం బహిర్గతం కావడంతో ఆయన తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహంతో రగిలిపోయారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న బండి సంజయ్‌ను సిద్దిపేట వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీసేందుకు ప్రయత్నించడంతో ఆయన కారు దిగకుండానే వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కరీంనగర్‌లోని ఇంట్లోనే ఉంటే ఆందోళనలు జరిగే ప్రమాదం ఉన్నదని భావించిన కరీంనగర్ పట్టణ రెండో పోలీస్‌స్టేషన్ పోలీసులు నిబంధనల ప్రకారం ఆయనను ముందస్తుగా అదుపులోకి (ప్రివెంటివ్ అరెస్ట్) తీసుకున్నారు.
అరెస్టును ముందుగానే ఊహించిన బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలను తన ఇంటి వద్దకు రప్పించుకున్నారు. అక్కడ బండి అనుయాయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అతికష్టం మీద రాత్రి 12 గంటల తర్వాత బండిని అదుపులోకి తీసుకొని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో బీజేపీ నేతలు హైదరాబాద్ నుంచి జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలను అక్కడకు రప్పించి నానా యాగీ చేశారు. కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పోలీస్‌స్టేషన్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన పోలీసులను దుర్భాషలాడారు.
ఓ సందర్భంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు సమీపంలోని మంచాల, ఆదిబట్ల, తుర్కపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు లైసెన్స్ గన్‌తో అక్కడకు చేరుకోగా.. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు శామీర్‌పేట పీఎస్‌కు తరలించారు. మరోవైపు మహిళా కార్యకర్తలను ముందుపెట్టి డ్రామా నడిపేందుకు ప్రయత్నించడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు.
వరంగల్ పోలీసులకు అప్పగింత
వరంగల్ పోలీసులు జరిపిన విచారణలో పదో తరగతి పేపర్ లీకేజీ వెనుక బండి సంజయ్ పాత్ర ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. బుధవారం ఉదయం మరిన్ని ఆధారాలను పరిశీలించి, పక్కాగా నిర్ధ్దారించుకున్న తర్వాతనే బండి సంజయ్‌ని అరెస్ట్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వరంగల్ పోలీసులు బొమ్మల రామారం పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో బొమ్మల రామారం పోలీసులు బండిని వరంగల్ పోలీసులకు అప్పగించేందుకు సమాయత్తమయ్యారు.
అయితే, బీజేపీ శ్రేణులు అడ్డుకుని, రచ్చ చేసే అవకాశం ఉండటంతో పోలీసులు ఆయనను నాటకీయంగా, చాకచర్యంగా వరంగల్ సరిహద్దు వరకు తరలించారు. మొదట బండిని హైదరాబాద్ తీసుకెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే పోలీసులు మాత్రం తుర్కపల్లి రోడ్డు వైపు తీసుకెళ్లారు. దీంతో భువనగిరి కోర్టులో హాజరుపర్చుతారని భావించారు. అయితే పోలీసులు భువనగిరిలో ఆగకుండా ఆలేరు వైపు తీసుకెళ్లారు. ఆలేరులో కూడా ఆగకుండా నేరుగా హైవే మీదుగా వరంగల్ సరిహద్దు పెంబర్తి వరకు తరలించారు. చివరకు బండి సంజయ్‌ను ఉదయం 11:30 గంటలకు పెంబర్తి ఆర్చ్ వద్ద వరంగల్ పోలీసులకు అప్పగించారు.
బండిని వరంగల్‌కు తరలిస్తున్న క్రమంలో బీజేపీ కార్యకర్తలు అడుగడుగునా పోలీసులకు అడ్డంపడ్డారు. పెంబర్తి జాతీయ రహదారిపై ధర్నా పేరుతో నానా యాగీ చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద టైర్లు వేసి నిప్పుపెట్టారు. ఈ దుశ్చర్యతో జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనాన్ని సైతం అడ్డగించారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టాల్సి వచ్చింది.
బండి సంజయ్‌ని వైద్య పరీక్షల నిమిత్తం పాలకుర్తిలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా, అక్కడ సైతం ఆందోళనకు దిగి రోగులను ఇబ్బంది పెట్టారు. పోలీసులు బండి సంజయ్‌ను అక్కడి నుంచి మడికొండలోని పోలీస్ ట్రైనింగ్ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లారు. తర్వాత హనుమకొండలోని కోర్టు కాంప్లెక్స్‌కు తీసుకెళ్లి సీనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు కోర్టు కాంప్లెక్స్‌ను ముట్టడించడం, లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది.
ఈటల హౌస్ అరెస్ట్
బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆ పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మేడ్చల్ మండలం పూడూరు పంచాయతీ పరిధిలో ఉన్న తన గృహం నుంచి వెళ్తుండగా హకీంపేట వద్ద మేడ్చల్ పోలీసులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, తిరిగి ఇంటికి పంపించారు.