హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): హైడ్రా కూల్చివేతల విషయంలో అక్బరుద్దీన్‌కు ఓ న్యాయం.. పేదలకు ఓ న్యాయమా..? అని బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్‌రావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో వేలాది మంది పేదలు, మధ్య తరగతి ప్రజల ఇండ్లను కాంగ్రెస్ సర్కారు కూలుస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీ కాలేజీ పాతబస్తీ సల్కం చెరువులో కట్టిన మాట వాస్తవమేనని, 10వేల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేయలేమని ప్రభుత్వం చెప్పడం ఏంటని మండిపడ్డారు. కాంగ్రెస్ మార్క్.. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా అని విమర్శించారు. తక్షణమే అక్బరుద్దీన్ కాలేజీని కూల్చేయాలని, లేకుంటే బీజేపీ ఆపని చేస్తుందని హెచ్చరించారు.
గిరిజన సంక్షేమశాఖలో ఆంధ్రా పెత్తనం! ; ఇంజినీరింగ్ విభాగంలో అధికారుల ఇష్టారాజ్యం
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): గిరిజన సంక్షేమశాఖలో ఆంధ్రాపెత్తనం రాజ్యమేలుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెరిట్ ప్రకారం కాకుండా దొడ్డిదారిన ఆంధ్రాకు చెందిన జూనియర్ అధికారికి కీలక బాధ్యతలను కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు, సీఎం పేషీలోని వ్యక్తులే యత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణం స్పందించాలని, మెరిట్ ప్రకారమే ప్రమోషన్లను కల్పించాలని గిరిజనసంక్షేమశాఖ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖలో ఇంజినీరింగ్ విభాగం గిరిజన గ్రా మాల్లో రోడ్లు, భవనాలు, తదితర మౌలిక వసతుల నిర్మాణాలను పర్యవేక్షిస్తుంది. ఇందులో సీఈ, ఎస్ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈఈలకే ఎఫ్ఏసీలుగా నియమించి నెట్టుకొస్తున్నారు. ఇటీవలనే సీఈ సైతం ఉద్యోగ విరమణ పొందారు. కానీ ఆ స్థానంలో మెరిట్ ప్రకారం సీఈ బాధ్యతలను అప్పగించకుండా ఆంధ్రాకు చెందిన జూనియర్‌కు సీఈగా అదనపు బాధ్యతలను ఉన్నతాధికారులు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో పలువురు సెక్రటేరియట్ అధికారులు చక్రం తిప్పారని, సదరు పెద్దలకు భారీమొత్తంలో ముడుపులు ముట్టాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా సీఈ, ఎస్ఈ పోస్టుల ప్రమోషన్లకు సంబంధించి డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)కి సైతం సదరు ఆంధ్రా జూనియర్ అధికారి పేరునే ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వంలోని ముఖ్యనేతలు, కీలక అధికారులు అక్రమ పద్ధతి ప్రమోషన్లు కల్పిస్తే ఊరుకోబోమని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.