మేడ్చల్ : దేశంలో బీజేపీ పాలకులు అవలంభిస్తున్న ఉన్మాద రాజకీయం, ఫాసిస్ట్ భావజాలానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(CPI Secretary Koonamneni Sambasiva Rao) పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్నగర్ లో నిర్వహించిన సీపీఐ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అనుసరిస్తున్న విద్వేషపూరిత రాజకీయం, ఫాసిస్టు భావజాలం పౌర సమాజంలో చొప్పిస్తు దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని విమర్శించారు.
‘ దేశానికి అచ్చా దిన్ రాలేదని’ పేర్కొన్నారు. విదేశాలలో ములుగుతున్న నల్లధనాన్ని(Block Money) తీసుకురాలేదని, ప్రజలకు పంచ లేదని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుచేసి దేశంలో నల్లధనం వెలికి తీస్తానన్నది జరగలేదని వారన్నారు. పెట్రోల్(Petroll), గ్యాస్ ధరలు పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్రం విఫలం చెందిందని ఆరోపించారు.
ఈ దేశం హిందువులది మాత్రమేనని ఇతరులు పరాయి వారిగా చిత్రీకరించి బీజేపీ విద్వేష రాజకీయాలకు ఆజ్యం పోస్తుందని విమర్శించారు. బీజేపీ మనువాదానికి వ్యతరేకంగా ప్రజలను చైతన్యం చేసేందుకు సీపీఐ దేశ వ్యాప్తంగా ప్రజలను కలుస్తూ పోరాటాలకు సమాయత్తమవుతుందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్. బాలమల్లేశ్, సీపీ జిల్లా కార్యదర్శి డి జి సాయిల్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ దశరథ, మేడ్చల్ నియోజకవర్గం సీపీఐ కార్యదర్శి టి. శంకర్, జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు జే. లక్ష్మి, ఆర్ కృష్ణమూర్తి, రచ్చ కిషన్ తదితరులు పాల్గొన్నారు.