హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): బీజేపీలో కయ్యం మొదలైంది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మరో నేత వివేక్ వెంటకస్వామి ఏకంగా పార్టీ నేతల ముందే వాగ్వాదానికి దిగడం కనిపించింది. ఈ విషయం ఆదివారం(సంక్రాంతి రోజున) వందేభారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బయటపడింది. వివరాల్లోకి వెళితే.. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్‌కు వివేక్ ఆర్థికంగా సాయం చేశారు. ఎన్నికల తర్వాత తిరిగి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. 2021 అక్టోబర్‌లో ఎన్నికలు జరుగగా, ఆ తర్వాత వివేక్ పలుమార్లు డబ్బులు అడిగినట్టు తెలిసింది. ఓ దశలో ఈటలకు నేరుగా ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సన్నిహితులు చెబుతున్నారు. డబ్బులకు బదులు స్థలం రాసిస్తానని ఈటల హామీ ఇచ్చినట్టు సమాచారం. నెలలు గడుస్తున్నా ఈటల ఆ హామీని కూడా నెరవేర్చలేదు.
ఇటీవల మునుగోడు ఎన్నికల్లో వివేక్‌కు స్టీరింగ్ కమిటీ బాధ్యతలు అప్పగించడంతో డబ్బు అవసరం పడింది. ఈటలపై మరోసారి తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. ఎన్నికలు పూర్తికాగానే స్థలం రాసిస్తానని అప్పటికప్పుడు నచ్చజెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మునుగోడు ప్రచారం ఇద్దరూ కలిసి తిరిగినట్టు పైకి కనిపించినా, తెర వెనక మాత్రం ఎడముఖం, పెడముఖంగా ఉన్నారని కార్యకర్తలే చర్చించుకున్నారు. మునుగోడు ఎన్నికలు పూర్తయ్యి నెలలు గడుస్తున్నా ఈటల స్పందించకపోవడంతో వివేక్‌కు సహనం నశించింది. ఆదివారం వందేభారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఈటల రాజేందర్, వివేక్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వివేక్ నేరుగా ఈటలను డబ్బులు ఇస్తావా? లేదంటే స్థలం రాసిస్తావా? అని నిలదీశారు. ఆ సమయంలో చుట్టూ పలువురు పార్టీ నేతలు ఉన్నారు. అందరి ముందు అడగడంతో పరువు పోయినట్టు ఈటల భావించి, వివేక్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగగా, పక్కన ఉన్న నేతలు వారిని సముదాయించి పక్కకు తీసుకెళ్లారు. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఫిర్యాదు చేయాలని వివేక్ భావిస్తుండగా, తనను అవమానించిన తీరును ఏకంగా ఢిల్లీ పెద్దల వద్దే తేల్చుకుంటానని ఈటల తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు సమాచారం.